Hamas: రెండో విడతలో 17మంది బందీలను విడుదల చేసిన హమాస్
తమ చేతిలో బందీలుగా ఉన్న వారిలో మరికొంత మందిని హమాస్ మిలిటెంట్లు ఆదివారం విడుదల చేశారు. శనివారం మొదటి విడదలో 24మంది బందీలకు విముక్తి కల్పించిన హమస్.. తాజాగా మరో 17మందిని ఇజ్రాయెల్‌కు అప్పగించింది. తాజాగా విడుదలైన వారిలో 13మంది ఇజ్రాయెలీలు, నలుగురు థాయ్ పౌరులు ఉన్నారు. ఖతార్, ఈజిప్ట్ మధ్యవర్తిత్వంతో హమాస్- ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంలో తమ చేతిలో ఉన్న 50మందిని విడుదల చేస్తామని హమాస్ చెప్పింది. అలాగే తమ జైళ్లలో ఉన్న 150మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేస్తామని ఇజ్రాయెల్ పేర్కొంది. ఈ క్రమంలో ఇప్పటి వరకు రెండు విడతల్లో కలిపి.. 41 మందిని హమాస్ విడుదల చేసింది.
39 మంది పాలస్తీనా ఖైదీల విడుదల
హమాస్ నుంచి విడుదలై బందీలు తొలుత ఇజ్రాయెల్‌లోని ఆసుపత్రులకు వెళ్తారని, ఆ తర్వాత వారి కుటుంబాలను కలుస్తారని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) తెలిపింది. ఇదిలా ఉంటే, రెండో విడుతలో భాగంగా ఇజ్రాయెల్ 39 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేసింది. ఇందులో దాదాపు 33మంది మైనర్లు ఉన్నారు. బందీలను అప్పగించే విషయంలో రెడ్ క్రాస్ మధ్యవర్తిత్వం వహిస్తోంది. ఇజ్రాయెల్‌తో చేసుకున్న నాలుగు రోజుల కాల్పుల విరమణకు హమాస్ కట్టుబడి ఉందని ఓ పాలస్తీనా అధికారి తెలిపారు. అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో 1,200 మందిని చంపి, 240 మందిని హమాస్ బందీలుగా పట్టుకుంది.