LOADING...
USA: అమెరికాలో అలర్ట్‌.. రూబియో, హెగ్సెత్‌ ఇళ్లపై డ్రోన్ల కలకలం
అమెరికాలో అలర్ట్‌.. రూబియో, హెగ్సెత్‌ ఇళ్లపై డ్రోన్ల కలకలం

USA: అమెరికాలో అలర్ట్‌.. రూబియో, హెగ్సెత్‌ ఇళ్లపై డ్రోన్ల కలకలం

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 19, 2026
10:42 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇరాన్‌-అమెరికా మధ్య యుద్ధ ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో యూఎస్‌లో డ్రోన్‌ల కలకలం రేపింది. వాషింగ్టన్‌లోని ఫోర్ట్‌ మెక్‌నాయర్‌ సైనిక స్థావరం పై గుర్తుతెలియని డ్రోన్‌లను అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఇదే ప్రాంతంలో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ నివాసాలు ఉండటంతో ఈ ఘటన తీవ్ర ఆందోళనకు దారితీసింది. అధికారుల వివరాల ప్రకారం ఈ డ్రోన్‌లు ఎక్కడి నుంచి వచ్చాయనే అంశం ఇంకా స్పష్టంగా తెలియలేదు. 10 రోజులుగా ఫోర్ట్‌ మెక్‌నాయర్‌ పరిసరాల్లో పలు డ్రోన్‌లు కనిపించాయని తెలిపారు. దీంతో ఉన్నతాధికారులు అత్యవసర సమావేశాలు నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు.

వివరాలు

ఇరాన్‌ నుంచి ప్రతీకార చర్యలు

ఇదిలాఉండగా ఇజ్రాయెల్‌ దాడుల్లో ఇరాన్‌కు చెందిన కీలక నేతలు అలీ లారిజాని, నిఘా మంత్రి ఇస్మాయిల్‌ ఖతీబ్‌ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరాన్‌ నుంచి ప్రతీకార చర్యలు ఉండొచ్చన్న అనుమానంతో అమెరికా సైన్యాన్ని అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో విదేశాల్లోని అమెరికా దౌత్య కార్యాలయాలకు భద్రతా హెచ్చరికలు జారీ చేయడంతో పాటు, దేశీయ సైనిక స్థావరాల వద్ద కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. తాజా డ్రోన్‌ కదలికల నేపథ్యంలో రూబియో, హెగ్సెత్‌లను సురక్షిత ప్రాంతాలకు తరలించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ఓ అధికారి వెల్లడించారు. అయితే ప్రస్తుతం వారు తమ నివాసాల వద్దే ఉన్నట్లు సమాచారం.

Advertisement