Russian oil: రష్యా చమురుపై ఆంక్షల సడలింపు మరో నెల పొడిగింపు
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా ఆర్థిక శాఖ రష్యా ముడి చమురుకు సంబంధించిన ఆంక్షల మినహాయింపును మరో నెలపాటు పొడిగించింది. సముద్ర మార్గంలో ఇప్పటికే ప్రయాణిస్తున్న రష్యా చమురు రవాణాలకు ఈ వెసులుబాటు వర్తించనుంది. తాజాగా విడుదల చేసిన సాధారణ అనుమతి పత్రం 134సీ ప్రకారం, ఏప్రిల్ 17కు ముందు సముద్రంలో ఉన్న రష్యా చమురు సరకు రవాణాలకు జూన్ 17 వరకు అనుమతి కల్పించారు. అయితే ఇరాన్, ఉత్తర కొరియా, క్యూబా లేదా రష్యా ఆక్రమిత ఉక్రెయిన్ ప్రాంతాలకు చెందిన వ్యక్తులు, సంస్థలతో జరిగే లావాదేవీలకు ఈ మినహాయింపు వర్తించదని స్పష్టం చేశారు.
వివరాలు
జూన్ 17 వరకు ఆంక్షల సడలింపు
ఇప్పటికే అమెరికా మార్చి 5 నుంచి భారత్‌తో పాటు కొన్ని దేశాలకు రష్యా చమురు కొనుగోళ్లపై అమలులో ఉన్న ఆంక్షల్లో తాత్కాలిక సడలింపు ఇచ్చింది. ఆ గడువును మొదట ఏప్రిల్ 11 వరకు, అనంతరం మే 16 వరకు పెంచగా.. ఇప్పుడు మరోసారి జూన్ 17 వరకు పొడిగించింది. ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాలో అంతరాయాలు తలెత్తకుండా చూడటం, అంతర్జాతీయ మార్కెట్లలో స్థిరత్వం కొనసాగించడమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు.
వివరాలు
ఆంక్షలు ఉన్నా.. లేకున్నా
ఇదిలా ఉండగా, అమెరికా మినహాయింపులు ఉన్నా లేకపోయినా రష్యా నుంచి చమురు కొనుగోళ్లు కొనసాగుతాయని భారత్ స్పష్టం చేసింది. పెట్రోలియం శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ మాట్లాడుతూ.. దేశ అవసరాలు, సరఫరా పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని మాత్రమే భారత్ నిర్ణయాలు తీసుకుంటుందని తెలిపారు. రష్యాపై ఆంక్షలు అమల్లో ఉన్న సమయంలో కూడా ఆ దేశం నుంచి చమురు కొనుగోలు చేశామని, ఆంక్షల సడలింపుల తర్వాత కూడా దిగుమతులు కొనసాగుతున్నాయని చెప్పారు. భవిష్యత్తులోనూ రష్యా చమురును భారత్ కొనుగోలు చేస్తుందని ఆమె వెల్లడించారు. దీర్ఘకాలిక ఒప్పందాల కారణంగా దేశానికి అవసరమైన ముడి చమురు సరిపడా అందుతోందని, ఎలాంటి కొరత లేదని వివరించారు.
వివరాలు
ఆంక్షలు ఉన్నా.. లేకున్నా
2022లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత పశ్చిమ దేశాలు రష్యాపై పలు ఆంక్షలు విధించాయి. దీంతో రష్యా తక్కువ ధరలకు భారత్ వంటి దేశాలకు చమురును విక్రయించడం మొదలుపెట్టింది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరిగిన సమయంలో తక్కువ ధరకే లభించిన రష్యా చమురు భారత్‌కు భారీ ఊరటనిచ్చింది. ప్రస్తుతం కూడా భారత చమురు దిగుమతుల్లో రష్యా కీలక స్థానాన్ని కొనసాగిస్తోంది.