Maria Corina Machado: అమెరికా మాట నిలబెట్టుకుంది.. అధికార మార్పిడికి సహకరించాలి : మచాడో
ఈ వార్తాకథనం ఏంటి
వెనెజువెలా రాజధాని కారకాస్‌పై అమెరికా సైన్యం మెరుపుదాడి చేపట్టి, ఆ దేశాధ్యక్షుడు నికొలస్ మదురోతో పాటు ఆయన భార్యను బంధీగా తీసుకెళ్లిన ఘటన అంతర్జాతీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఈపరిణామాలపై వెనెజువెలా ప్రతిపక్ష కీలక నాయకురాలు మరియా కొరినా మచాడో తొలిసారిగా స్పందించారు. అమెరికా తన వాగ్దానాన్ని నిలబెట్టుకుందని పేర్కొన్న ఆమె, వెనెజువెలాకు స్వేచ్ఛ తిరిగి వచ్చిందని వ్యాఖ్యానించారు. వెనెజువెలా ప్రజలారా... స్వేచ్ఛా సమయం ఆసన్నమైంది. వెనెజువెలా ప్రజలు, ఇతర దేశాల పౌరులపై జరిగిన ఘోర నేరాలకు నికొలస్ మదురో ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నారు. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించేందుకు అతడు నిరాకరించాడు. అందుకే అమెరికా తన వాగ్దానాన్ని నిలబెట్టుకుందని ఆమె పేర్కొన్నారు.
Details
రాజకీయ ఖైదీలను విడుదల చేస్తాం
ప్రజా సార్వభౌమాధికారంతో వెనెజువెలాను పాలించే సమయం వచ్చిందని మచాడో అన్నారు. రాజకీయ ఖైదీలను విడుదల చేస్తామని, శాంతియుతమైన భవిష్యత్తును నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ప్రజాస్వామ్యం కోసం తాను ఎన్నో సంవత్సరాలుగా చేసిన పోరాటం ఫలించినట్టుగా పేర్కొన్నారు. వెనెజువెలా తదుపరి అధ్యక్ష పదవికి ఎడ్మండో గొంజాలేజ్ ఉరుటియాకు తన పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా అధికార మార్పిడికి ప్రజలు సహకరించాలని ఆమె పిలుపునిచ్చారు. గతేడాది నోబెల్ శాంతి బహుమతి ప్రకటనతో మచాడో వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె నార్వే రాజధాని ఓస్లోలో ఉన్నట్లు సమాచారం.
Details
మచాడోకు మద్దతు లేదు: ట్రంప్
మదురో నిర్బంధం అనంతరం వెనెజువెలాలో అధికార బాధ్యతలు ఎవరు చేపట్టాలన్న అంశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరినా మచాడోకు అధికార బాధ్యతలు అప్పగించే అంశాన్ని ఆయన తోసిపుచ్చారు. మచాడో మంచి మహిళేనని పేర్కొన్న ట్రంప్, అయితే ఆమె నాయకురాలిగా వ్యవహరించడం చాలా కష్టమని అభిప్రాయపడ్డారు. దేశంలో ఆమెకు సరైన ప్రజా మద్దతు లేదని కూడా వ్యాఖ్యానించారు.
Details
అమెరికా దాడుల్లో 40 మంది మృతి
కారకాస్‌పై అమెరికా సైన్యం నిర్వహించిన దాడుల్లో దాదాపు 40 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతుల్లో సామాన్య ప్రజలతో పాటు సైనికులు కూడా ఉన్నట్లు సమాచారం. ఈ విషయాన్ని వెనెజువెలాకు చెందిన సీనియర్ అధికారి ఉటంకిస్తూ అంతర్జాతీయ మీడియా కథనాలు ప్రచురిస్తున్నాయి.