Artillery shells: రష్యాపైకి భారత్ మందుగుండు సామాగ్రి.. ఉక్రెయిన్‌కు విక్రయించలేదంటున్న ఢిల్లీ..!
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో భారత్ స్వతంత్ర వైఖరిని ప్రకటించినప్పటికీ, ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. మన దేశానికి చెందిన ఆర్టిలరీ షెల్స్ ఉక్రెయిన్‌లో ఉపయోగించబడుతున్నాయని అంతర్జాతీయ మీడియా తాజా కథనం వెల్లడించింది. రష్యా అభ్యంతరాలు ఉన్నప్పటికీ, భారత్‌కు చెందిన ఆయుధాల తయారీ సంస్థలు విక్రయించిన షెల్స్ ఐరోపా కస్టమర్ల ద్వారా ఉక్రెయిన్‌కు చేరుకున్నాయని పేర్కొంది. ఈ వాణిజ్య కార్యకలాపాలను అడ్డుకోవడం కోసం దిల్లీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని, గత ఏడాది నుండి ఈ వాణిజ్యం జరుగుతోందని సమాచారం అందించింది.
ఉక్రెయిన్‌కు ఎలాంటి ఆయుధాలు విక్రయించడం లేదు: రణధీర్ జైశ్వాల్
ఈ ఏడాది జులైలో రష్యా-భారత్ విదేశాంగ మంత్రుల మధ్య భేటీలో ఈ విషయం చర్చకు వచ్చినట్లు సమాచారం. అయినప్పటికీ, ఈ వినియోగానికి సంబంధించి రష్యా, భారత్ విదేశీ, రక్షణ మంత్రిత్వశాఖల నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు. అయితే, ఈ జనవరిలో, మన విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ మీడియాతో మాట్లాడుతూ, భారత్ ఉక్రెయిన్‌కు ఎలాంటి ఆయుధాలు విక్రయించడం లేదా సరఫరా చేయడం లేదని స్పష్టం చేశారు.
ఉక్రెయిన్ వినియోగించే మందుగుండు సామగ్రిలో దిల్లీ వాటా చాలా తక్కువ
విపణిలో ఉక్రెయిన్ వినియోగించే మందుగుండు సామగ్రిలో దిల్లీ వాటా చాలా తక్కువ అని, యుద్ధం ప్రారంభమైనప్పుడు ఆ దేశం దిగుమతి చేసుకున్న ఆయుధాల్లో ఆ షెల్స్ వాటా ఒకశాతం కంటే తక్కువ అని తెలుస్తోంది. అయితే, వాటిని ఐరోపా కస్టమర్లు విరాళంగా ఇచ్చారా లేదా వాణిజ్యంలో భాగంగా మారాయా అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. ఈ పరిణామాలను మన ప్రభుత్వం పరిశీలించిందని, కానీ సరఫరాను అడ్డుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదని భారత అధికారి ఒకరు వెల్లడించారు.