Loading...
AP Teachers: ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల హాజరుపై కఠిన నిబంధనలు
ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల హాజరుపై కఠిన నిబంధనలు

AP Teachers: ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల హాజరుపై కఠిన నిబంధనలు

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 02, 2026
08:24 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయుల హాజరు వ్యవస్థపై పాఠశాల విద్యాశాఖ కీలక మార్పులు చేసింది. క్రమశిక్షణ, సమయపాలనను మరింత కట్టుదిట్టం చేయాలనే ఉద్దేశంతో కొత్త,కఠిన మార్గదర్శకాలను అమల్లోకి తెచ్చింది. ఇకపై ప్రతి రోజు ఉదయం 9 గంటలలోపు ఉపాధ్యాయులు తప్పనిసరిగా పాఠశాలకు చేరుకుని హాజరు నమోదు చేయాలి. ఆ సమయం దాటితే నమోదు చేసిన హాజరును 'లేట్ ఇన్‌'గా పరిగణిస్తామని స్పష్టం చేసింది.ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల హాజరుపై కఠిన నిబంధనలు

వివరాలు 

హాజరు, హాఫ్‌డే సెలవులపై స్పష్టమైన మార్గదర్శకాలు

కొత్త నిబంధనల ప్రకారం నెలలో కేవలం ఒకటి లేదా రెండు సందర్భాల్లో మాత్రమే 10 నిమిషాల గ్రేస్ పీరియడ్ (వెసులుబాటు సమయం) అనుమతించబడుతుంది.

హాఫ్‌డే సెలవులు తీసుకునే ఉపాధ్యాయుల విషయంలో కూడా ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు.

ఉదయం సెలవు తీసుకుని మధ్యాహ్నం విధులకు హాజరయ్యే వారు ఒంటి గంటలోపు హాజరు నమోదు చేయాలి.

ఆ తర్వాత నమోదు చేస్తే అది 'లేట్ ఇన్‌'గానే లెక్కలోకి వస్తుంది.

అలాగే ఉదయం విధులకు హాజరై మధ్యాహ్నం సెలవు తీసుకునే వారు మధ్యాహ్నం 12:30 గంటల కంటే ముందుగా 'ఔట్ టైమ్' నమోదు చేయరాదు.

వివరాలు 

పాఠశాల ముగింపు సమయంపై కఠిన నియంత్రణ

పాఠశాలలు ముగిసే సమయానికి సంబంధించి కూడా శాఖ నియమాలను మరింత కఠినతరం చేసింది.

ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు సాయంత్రం 3:30 గంటల కంటే ఒక్క నిమిషం ముందుగానైనా 'ఔట్ టైమ్' నమోదు చేస్తే దాన్ని 'ఎర్లీ ఔట్‌'గా పరిగణిస్తారు.

ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయుల విషయంలో సాయంత్రం 4 గంటల కంటే ముందు నమోదు చేసినా అదే విధంగా 'ఎర్లీ ఔట్‌'గా లెక్కిస్తారు.

ముఖ్యంగా ఉదయం 'ఇన్ టైమ్' నమోదు చేసి, సాయంత్రం 'ఔట్ టైమ్' నమోదు చేయడం మరిచిపోతే ఆ రోజు పూర్తిగా గైర్హాజరైనట్లుగా పరిగణిస్తారు.

అంటే ఉదయం హాజరై వెంటనే వెళ్లిపోయినట్లుగా నమోదు అవుతుంది.

ADVERTISEMENT

వివరాలు 

నిబంధనలపై ఉపాధ్యాయ సంఘాల అభ్యంతరం

పాఠశాల విద్యాశాఖ తీసుకున్న ఈ నిర్ణయంపై తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

కేవలం ఒక నిమిషం ఆలస్యమైనా గైర్హాజరుగా పరిగణించడం సరైన విధానం కాదని అభిప్రాయపడింది.

గతంలో అమలులో ఉన్న 10 నిమిషాల గ్రేస్ పీరియడ్‌ను యథాతథంగా కొనసాగించాలని డిమాండ్ చేసింది.

హాజరు నమోదు చేసే యాప్ కొన్ని సందర్భాల్లో సరిగా పనిచేయదని, అలాంటి సాంకేతిక సమస్యలకు ఉపాధ్యాయులను బాధ్యులను చేయడం అన్యాయమని పేర్కొంది.

ఒకవైపు ప్రభుత్వం తమను "ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ"గా చెప్పుకుంటూ, మరోవైపు ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోవడం విరుద్ధమని సంఘం నేతలు వ్యాఖ్యానించారు.

ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఈ నిబంధనలను పునఃసమీక్షిస్తుందా? లేక యథాతథంగా అమలు చేస్తుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.

ADVERTISEMENT