US: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. ముగ్గురు సహోద్యోగులను చంపి నిందితుడు ఆత్మహత్య
ఈ వార్తాకథనం ఏంటి
అగ్రరాజ్యం అమెరికా మరోసారి కాల్పుల ఘటనతో షాక్‌కు గురైంది. టెక్సాస్ రాష్ట్రం శాన్ ఆంటోనియోలోని ఒక ల్యాండ్‌స్కేప్ సరఫరా కంపెనీలో ఘోర ఘటన చోటుచేసుకుంది. అక్కడ పనిచేస్తున్న 21 ఏళ్ల యువకుడు తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ దాడిలో ముగ్గురు సహోద్యోగులు అక్కడికక్కడే మృతి చెందగా, అనంతరం నిందితుడు తనపై తానే కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు.
Details
మృతుల్లో ఇద్దరు పురుషులు, ఒక మహిళ
ఆదివారం ఉదయం 8 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. మృతుల్లో ఇద్దరు పురుషులు, ఒక మహిళ ఉన్నారని ధృవీకరించారు. కాల్పులు ప్రారంభమైన వెంటనే అక్కడి ఉద్యోగులు ప్రాణాల కోసం సంఘటనాస్థలి నుంచి పరుగులు తీశారని పోలీసులు తెలిపారు. నిందితుడిని జోస్ హెర్నాండెజ్ గాలో (21)గా గుర్తించారు. కాల్పులకు గల కారణం ఇంకా తెలియరాలేదని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.