Hadi Murder Accused In Dubai: హాదీ హత్య కేసులో ట్విస్ట్.. దుబాయ్‌లో ఉన్నానంటూ వీడియో విడుదల చేసిన ఫైసల్
ఈ వార్తాకథనం ఏంటి
విద్యార్థి నేత హాదీ హత్య కేసులో ఫైసల్ కరీమ్ మసూద్, ఆలంగీర్ షేక్‌లను బంగ్లాదేశ్ పోలీసులు ఇప్పటికే ప్రధాన అనుమానితులుగా గుర్తించారు. ఈ క్రమంలో ఫైసల్ ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్నట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. అయితే ఈ హత్యకు తనకు ఎలాంటి సంబంధం లేదని చెబుతూ ఫైసల్ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశాడు. ఆ వీడియోలో మాట్లాడిన ఫైసల్.. తనను ఉద్దేశపూర్వకంగా ఈ కేసులో ఇరికించారని ఆరోపించాడు. ప్రాణాలకు ముప్పు ఉందనే కారణంతోనే తాను దుబాయ్‌కు వెళ్లినట్లు వెల్లడించాడు.ఈ హత్య వెనుక జమాతే ఇస్లామీ పార్టీకి చెందిన విద్యార్థి విభాగంలోని కొందరి ప్రమేయం ఉందని అతడు ఆరోపణలు చేశాడు. అలాగే, హాదీతో తనకు వ్యాపార సంబంధాలు మాత్రమే ఉన్నాయని స్పష్టం చేశాడు.
వివరాలు
అనుమానితులు భారత్‌లో.. ఢాకా మెట్రోపాలిటన్ పోలీసులు
ప్రభుత్వ కాంట్రాక్టులు పొందేందుకు హాదీ చేస్తున్న రాజకీయ కార్యకలాపాలకు విరాళాలు ఇచ్చిన విషయాన్ని కూడా ఫైసల్ ఈ సందర్భంగా వెల్లడించాడు. డిసెంబరు 12న హాదీపై దాడి జరిగిన అనంతరం ఈ కేసులో అనుమానితులు దేశం విడిచి పారిపోయినట్లు బంగ్లాదేశ్ పోలీసులు ప్రకటించారు. వారు ప్రస్తుతం భారత్‌లో ఉన్నారని ఢాకా మెట్రోపాలిటన్ పోలీసులు ఇటీవల పేర్కొన్నారు. అయితే ఈ ఆరోపణలను భారత భద్రతా సంస్థలు పూర్తిగా ఖండించాయి. అంతర్జాతీయ సరిహద్దు దాటి ఎవరూ భారత్‌లోకి ప్రవేశించినట్లు ఎలాంటి ఆధారాలు లేవని బీఎస్‌ఎఫ్ అధికారులు, మేఘాలయ పోలీసులు స్పష్టంగా తెలిపారు. ప్రజలను తప్పుదారి పట్టించేందుకే పొరుగుదేశం ఇలాంటి ఆధారంలేని ఆరోపణలు చేస్తోందని వారు మండిపడ్డారు.
వివరాలు
హత్య కేసు దర్యాప్తు వేగవంతం
ఇదిలా ఉండగా, ఈ హత్య కేసు దర్యాప్తును ఢాకా పోలీసులు మరింత వేగవంతం చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే పలువురు అనుమానితులను అరెస్టు చేశారు. నిందితులు తప్పించుకునేందుకు సహకరించారన్న ఆరోపణలతో ఇద్దరిని రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.