LOADING...
Syria: సిరియాలో అసద్‌ విధేయుల దాడులు..  13 మంది పోలీసులు మృతి
సిరియాలో అసద్‌ విధేయుల దాడులు.. 13 మంది పోలీసులు మృతి

Syria: సిరియాలో అసద్‌ విధేయుల దాడులు..  13 మంది పోలీసులు మృతి

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 07, 2025
10:01 am

ఈ వార్తాకథనం ఏంటి

రాజకీయ సంక్షోభంలో చిక్కుకున్న సిరియాలో (Syria)ఆకస్మిక దాడులు చోటుచేసుకున్నాయి. తిరుగుబాటుదారుల ఆక్రమణ నేపథ్యంలో మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అసద్‌(Bashar al-Assad) దేశాన్ని విడిచిపెట్టిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా ఆయన మద్దతుదారులు పోలీసులపై దాడులు జరపడంతో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. స్థానిక అధికారుల ప్రకారం,గురువారం సిరియాలోని జబ్లే పట్టణంలో ఈ హింసాత్మక ఘటన జరిగింది. పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులపై అసద్ అనుచరులు దాడి చేయగా,13మంది మరణించగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే, సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ (Syrian Observatory for Human Rights)ప్రకారం ఈ దాడిలో 16 మంది మృతిచెందినట్లు భావిస్తున్నారు. అసద్‌ దేశాన్ని వీడినప్పటి నుండి,ఆయన మద్దతుదారులు మరియు ఇస్లామిక్ గ్రూపులకు మధ్య విభేదాలు తీవ్రమయ్యాయి.

వివరాలు 

సిరియాలో అంతర్యుద్ధం

ఈ నేపథ్యంలో తాజా దాడులు చోటుచేసుకున్నాయని పలు మీడియా కథనాలు వెల్లడించాయి. ఘర్షణల ప్రభావంతో సమీప నగరాల్లో 12 గంటల పాటు కర్ఫ్యూ విధించారు. 2011లో బషర్ అల్ అసద్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చారు. ఈ ప్రజా ఉద్యమాన్ని అణచివేయడానికి ఆయన ప్రయత్నించడంతో సిరియాలో అంతర్యుద్ధం ప్రారంభమైంది. ప్రభుత్వ దళాలు, తిరుగుబాటుదారుల మధ్య జరిగిన ఈ యుద్ధంలో ఇప్పటివరకు 6 లక్షల మందికి పైగా మరణించినట్లు నివేదికలు చెబుతున్నాయి. రష్యా,ఇరాన్ మద్దతుతో అసద్‌ సిరియాలోని మెజారిటీ ప్రాంతాలపై తన ఆధిపత్యాన్ని కొనసాగించినప్పటికీ, తిరుగుబాటుదారులు ఇటీవల మెరుపు దాడులతో సిరియాపై పట్టు సాధించారు. పరిస్థితి అదుపు తప్పడంతో అసద్ తన కుటుంబంతో సహా రష్యాకు వెళ్లిపోవాల్సి వచ్చింది.