LOADING...
Canada: కెనడాలో దారుణం.. భారత విద్యార్థిని కాల్చి చంపిన దుండగులు
కెనడాలో దారుణం.. భారత విద్యార్థిని కాల్చి చంపిన దుండగులు

Canada: కెనడాలో దారుణం.. భారత విద్యార్థిని కాల్చి చంపిన దుండగులు

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 26, 2025
08:56 am

ఈ వార్తాకథనం ఏంటి

కెనడాలో భారత విద్యార్థిపై జరిగిన కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది. టొరంటోలోని స్కార్‌బొరౌగ్‌ విశ్వవిద్యాలయం సమీపంలో యువ భారతీయ విద్యార్థి శివాంక్‌ అవస్థి (20)ని కొందరు దుండగులు కాల్చి చంపిన ఘటనపై టొరంటోలోని భారత రాయబార కార్యాలయం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ మేరకు ఎక్స్‌ (ట్విటర్‌)లో అధికారిక ప్రకటన విడుదల చేసింది. 'టొరంటో స్కార్‌బొరౌగ్‌ విశ్వవిద్యాలయం సమీపంలో జరిగిన కాల్పుల్లో యువ భారతీయ విద్యార్థి శివాంక్‌ అవస్థి ప్రాణాలు కోల్పోవడం తీవ్రంగా కలచివేసింది. ఈ క్లిష్ట సమయంలో బాధితుడి కుటుంబానికి భారత ప్రభుత్వం పూర్తిస్థాయిలో అండగా ఉంటుంది.

Details

పరారైన నిందితుడు

స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుంటూ వారికి అవసరమైన అన్ని రకాల సహాయం అందిస్తామని భారత రాయబార కార్యాలయం పేర్కొంది. ఈ హత్య మంగళవారం మధ్యాహ్నం చోటు చేసుకున్నట్లు టొరంటో పోలీసులు తెలిపారు. హైల్యాండ్‌ క్రీక్‌ ట్రెయిల్‌ వద్ద ఉన్న టొరంటో విశ్వవిద్యాలయ పరిసరాల్లో చదువుకుంటున్న శివాంక్‌పై గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరిపినట్లు వెల్లడించారు. ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నప్పటికీ, అప్పటికే శివాంక్‌ ప్రాణాలు కోల్పోయినట్లు నిర్ధారించారు. కాల్పులు జరిపిన నిందితులు అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు తెలిపారు.

Details

కళాశాల క్యాంపస్ తాత్కాలికంగా మూసివేత

దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా కళాశాల క్యాంపస్‌ను తాత్కాలికంగా మూసివేసినట్లు అధికారులు ప్రకటించారు. ఈ ఘటన యూనివర్సిటీ విద్యార్థుల్లో తీవ్ర భయాందోళనకు దారి తీసింది. ఇదిలా ఉండగా, ఇటీవల కెనడాలో మరో భారతీయ మహిళ హిమాన్షీ ఖురానా హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసులో అబ్దుల్‌ గఫూరీ అనే వ్యక్తిని ప్రధాన నిందితుడిగా పోలీసులు అనుమానిస్తున్నారు. అతడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కెనడాలో వరుసగా జరుగుతున్న ఇలాంటి ఘటనలు భారతీయుల్లో ఆందోళనను మరింత పెంచుతున్నాయి.

Advertisement