Pakistan, Saudi Arabia and Turkey: 'ఒక్క దేశంపై దాడి.. అందరిపైనా దాడే'.. పాక్,సౌదీ,టర్కీ కీలక రక్షణ ఒప్పందం
ఈ వార్తాకథనం ఏంటి
మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్థాన్, సౌదీ అరేబియా, టర్కీ శుక్రవారం కీలక రక్షణ ఒప్పందంపై సంతకాలు చేశాయి. "మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్"పేరుతో కుదిరిన ఈ ఒప్పందం ద్వారా మూడు దేశాల మధ్య రక్షణ సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు. ప్రాంతీయ భద్రతా సవాళ్లు పెరుగుతున్న సమయంలో ఈ ఒప్పందం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ ఒప్పందం ప్రకారం మూడు దేశాల్లో ఏ ఒక్క దేశంపై అయినా సాయుధ దాడి జరిగితే, దానిని మిగిలిన రెండు దేశాలపైనా జరిగిన దాడిగానే పరిగణిస్తారు. అలాంటి పరిస్థితుల్లో సంయుక్తంగా స్పందించేలా రక్షణ వ్యవస్థను బలోపేతం చేయాలని ఒప్పందంలో పేర్కొన్నారు. అలాగే మూడు దేశాల మధ్య అన్ని రంగాల్లో రక్షణ సహకారాన్ని విస్తరించేందుకు అంగీకరించారు.
వివరాలు
ముగ్గురు అగ్రనేతల సమక్షంలో కీలక ఒప్పందం
సౌదీ అరేబియాలో జరిగిన సమావేశంలో యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్,టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్,పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సమక్షంలో ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి.
మూడు రోజుల అధికారిక పర్యటన కోసం షెహబాజ్ షరీఫ్ గురువారం సౌదీ చేరుకున్నారు.
ఆయనతో పాటు పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిం మునీర్ సహా ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం కూడా వెళ్లింది.
చమురు సంపద కలిగిన సౌదీ అరేబియా,అణ్వాయుధ సామర్థ్యం ఉన్న పాకిస్థాన్,నాటోలో అమెరికా తర్వాత రెండో అతిపెద్ద సైన్యాన్ని కలిగిన టర్కీ ఈ ఒప్పందంతో ఒకే వేదికపైకి రావడం విశేషంగా మారింది.
ముఖ్యంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న టర్కీ రక్షణపరిశ్రమ కూడా ఈ భాగస్వామ్యానికి మరింత బలం చేకూర్చనుంది.
వివరాలు
భద్రత బలోపేతమే ప్రధాన లక్ష్యం
ఇరాన్ యుద్ధం, ప్రాంతీయ ఘర్షణల నేపథ్యంలో సౌదీ అరేబియా తన రక్షణ భాగస్వామ్యాలను విస్తరించేందుకు ప్రయత్నిస్తోంది.
గతంలో ఇరాన్‌కు మద్దతుగా ఉన్న హౌతీ తిరుగుబాటుదారులు, ఇరాక్ మిలీషియా వర్గాల నుంచి సౌదీ చమురు కేంద్రాలు, కీలక మౌలిక సదుపాయాలపై డ్రోన్లు, క్షిపణులతో పలుమార్లు దాడులు జరిగాయి.
దీంతో భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఏర్పడింది.
టర్కీ మీడియా కథనాల ప్రకారం ఈ ఒప్పందంలో భాగంగా మూడు దేశాలు సంయుక్త సైనిక విన్యాసాలు,సైనిక శిక్షణ, రక్షణ సాంకేతిక పరిజ్ఞాన మార్పిడి, గూఢచారి సమాచార పంచుకునే అంశాల్లో కూడా కలిసి పనిచేసే అవకాశం ఉంది.
వివరాలు
పాక్-సౌదీ బంధానికి మరింత బలం
గాజా, లెబనాన్, ఇరాన్ యుద్ధాలతో పాటు ఇజ్రాయెల్-టర్కీ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల సమయంలో ఈ ఒప్పందం కుదరడం అంతర్జాతీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
కాగా, గత సెప్టెంబరులోనే పాకిస్థాన్, సౌదీ అరేబియా ద్వైపాక్షిక వ్యూహాత్మక రక్షణ ఒప్పందంపై సంతకాలు చేశాయి.
అప్పుడే ఒక దేశంపై దాడిని రెండు దేశాలపైనా జరిగిన దాడిగానే పరిగణిస్తామని ప్రకటించాయి.
మరోవైపు సౌదీ అరేబియాలో ప్రస్తుతం సుమారు 25 లక్షల మందికి పైగా పాకిస్థాన్ పౌరులు నివసిస్తూ, ఉపాధి పొందుతున్నారు.
అలాగే పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థకు సౌదీ అరేబియా ఎన్నో సంవత్సరాలుగా కీలక ఆర్థిక మద్దతు అందిస్తోంది.