Loading...
Bangladesh: హత్యల తర్వాత ఇంట్లోనే తినడం, స్నానం.. రంగ్‌పూర్‌ ఘటనలో షాకింగ్‌ వివరాలు
హత్యల తర్వాత ఇంట్లోనే తినడం, స్నానం.. రంగ్‌పూర్‌ ఘటనలో షాకింగ్‌ వివరాలు

Bangladesh: హత్యల తర్వాత ఇంట్లోనే తినడం, స్నానం.. రంగ్‌పూర్‌ ఘటనలో షాకింగ్‌ వివరాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 24, 2026
08:42 am

ఈ వార్తాకథనం ఏంటి

బంగ్లాదేశ్‌లోని రంగ్‌పూర్‌లో ఓ హిందూ కుటుంబానికి చెందిన నలుగురు అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన తీవ్ర కలకలం రేపింది. మొదట ఈ ఘటన వెనుక మత విద్వేషం లేదా దోపిడీ కోణం ఉందేమోనని పోలీసులు అనుమానించారు. అయితే దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. హత్యల తర్వాత కూడా నిందితులు గంటల తరబడి అదే ఇంట్లో ఉండటం పోలీసులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. రంగ్‌పూర్‌లోని దాస్‌పారా ప్రాంతంలో రిటైర్డ్‌ టీచర్‌ గణపతి చక్రవర్తి (65),ఆయన భార్య ప్రీతిలత (50), కుమార్తె అగామి చక్రవర్తి ప్రార్థి (23),కుమారుడు ప్రియమ్‌ (12)నివసిస్తున్నారు. ఇటీవల వారి ఇంట్లో నలుగురి మృతదేహాలు చెల్లాచెదురుగా కనిపించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

వివరాలు 

మత విద్వేష దాడి జరిగిందా?

కుటుంబంలోని అందరి ఫోన్లు స్విచ్ఛాఫ్‌ కావడం, ఇంటి తలుపులు లోపలి నుంచి మూసి ఉండటంతో అనుమానాలు మరింత పెరిగాయి.

బంధువులు తలుపులు బద్ధలు కొట్టి లోపలికి వెళ్లగా ఒళ్లు గగుర్పొడిచే దృశ్యం కనిపించింది.

నలుగురూ హిందూ కుటుంబానికి చెందినవారే కావడంతో మత విద్వేష దాడి జరిగిందా? అనే కోణంలోనూ చర్చ జరిగింది.

అయితే దర్యాప్తు అనంతరం ఆ కోణానికి ఆధారాలు లేవని పోలీసులు తేల్చారు.

హత్యల తర్వాత నిందితులు ఇంట్లోనే ఉండి తినడం, స్నానం చేయడం వంటి వివరాలు బయటకు రావడం ఈ కేసును మరింత సంచలనంగా మార్చింది.

వివరాలు 

అసలు ఏం జరిగింది?

పోలీసుల వివరాల ప్రకారం.. గణపతి చక్రవర్తి ఇంటి పైకప్పుపైకి పొరుగింటి మార్గం ద్వారా ఇద్దరు వ్యక్తులు వెళ్లారు.

అక్కడ వారు 'యాబా' అనే మత్తు పదార్థాన్ని తీసుకుంటున్నారు. ఆ సమయంలో శబ్దాలు రావడంతో గణపతి పైకప్పుపైకి వెళ్లి వారిని ప్రశ్నించారు.

తమను గుర్తుపడతారనే భయంతో ఆ ఇద్దరూ ఆయన గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.

గణపతి ఎంతకీ కిందకు రాకపోవడంతో ఆయన భార్య,కుమార్తె, కుమారుడు కూడా పైకి వెళ్లినట్లు దర్యాప్తులో వెల్లడైంది.

దీంతో తమను గుర్తిస్తారనే భయంతో వారినీ హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.

గురువారం ఈ దారుణం జరగగా.. కేసులో ముఘ్దో, సిద్ధార్థ అనే ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

విచారణలో వారు నేరాన్ని అంగీకరించినట్లు అధికారులు వెల్లడించారు.

ADVERTISEMENT

వివరాలు 

హత్యల తర్వాత ఆరు నుంచి ఏడు గంటలు ఇంట్లోనే..

ఈ కేసులో అత్యంత షాకింగ్‌ అంశం హత్యల తర్వాత నిందితులు వెంటనే అక్కడి నుంచి పారిపోకపోవడమే.

పోలీసుల ప్రకారం.. నిందితులు సుమారు ఆరు నుంచి ఏడు గంటల పాటు అదే ఇంట్లో ఉన్నారు.

ఇంట్లోని వివిధ ప్రాంతాల్లో తిరిగారు. ఖర్జూరాలు, దోసకాయలు తిన్నారు.అనంతరం స్నానం కూడా చేశారు.

ఆ తర్వాత మత్తు పదార్థం తీసుకున్న ఆనవాళ్లు కూడా పోలీసులకు లభించినట్లు అధికారులు తెలిపారు.

దోపిడీ జరిగినట్లు నమ్మించేందుకు ఇంట్లోని వస్తువులను కావాలనే చిందరవందర చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

అలాగే నేరానికి సంబంధించిన ఆధారాలను చెరిపివేసేందుకు నిందితులు ప్రయత్నించినట్లు దర్యాప్తులో గుర్తించారు.

మృతుల మొబైల్‌ ఫోన్లలోని ఆధారాలను కూడా తొలగించే ప్రయత్నం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు.

ADVERTISEMENT

వివరాలు 

హిందువుల భద్రతపై మరోసారి చర్చ

ఈ ఘటనతో బంగ్లాదేశ్‌లో మైనారిటీల భద్రతపై మరోసారి చర్చ మొదలైంది.

గతంలోనూ హిందూ సమాజంపై దాడులు, ఆలయాలపై దాడులు, ఆస్తుల ధ్వంసం వంటి ఘటనలపై భారత్‌ ఆందోళన వ్యక్తం చేసింది.

బంగ్లాదేశ్‌లో హిందువులు సహా మైనారిటీలపై చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలను భారత ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ గతంలో తెలిపారు.

అయితే రంగ్‌పూర్‌లో తాజాగా జరిగిన ఈ ఘటనకు మత విద్వేషంతో సంబంధం లేదని, మత్తు పదార్థాలు తీసుకునే వ్యక్తులే ఈ హత్యలకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు.

మరోవైపు రంగ్‌పూర్‌ ఘటనపై భారత ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ప్రత్యేకంగా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

ADVERTISEMENT