Loading...
Australia: వలసలను భారీగా తగ్గించనున్న ఆస్ట్రేలియా.. భారతీయులపై ప్రభావం ఇదే..
వలసలను భారీగా తగ్గించనున్న ఆస్ట్రేలియా..భారతీయులపై ప్రభావం ఇదే..

Australia: వలసలను భారీగా తగ్గించనున్న ఆస్ట్రేలియా.. భారతీయులపై ప్రభావం ఇదే..

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 06, 2026
03:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆస్ట్రేలియాలో వలసల సంఖ్యను భారీగా తగ్గించేందుకు ప్రతిపక్ష కన్జర్వేటివ్ కూటమి కీలక ప్రతిపాదన చేసింది. అధికారంలోకి వస్తే తమ తొలి రెండేళ్లలో నికర విదేశీ వలసలను ఏడాదికి 1 లక్షకు పరిమితం చేస్తామని ప్రతిపక్ష నేత అంగస్ టేలర్ ప్రకటించారు. ఆ తర్వాత మూడో ఏడాది 1.30లక్షలకు,నాలుగో ఏడాది 1.60లక్షలకు పెంచుతామని తెలిపారు. నాలుగేళ్లలో తాత్కాలిక వీసాల సంఖ్యను సుమారు 6.5లక్షల మేర తగ్గించాలని కూటమి భావిస్తోంది. ఆస్ట్రేలియా బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ గణాంకాల ప్రకారం.. 2026 మార్చితో ముగిసిన ఏడాదిలో దేశానికి 2,92,100 మంది నికర విదేశీ వలసదారులు వచ్చారు. ఈ నేపథ్యంలో 1లక్షకు పరిమితం చేయాలన్న ప్రతిపాదన ప్రస్తుత స్థాయితో పోలిస్తే గణనీయమైన కోత కానుంది.

వివరాలు 

ఆస్ట్రేలియాలో అత్యధిక విదేశీ జనాభాగా భారత్

ఈ విధానాన్ని ప్రకటిస్తూ అంగస్ టేలర్.. ''ఆస్ట్రేలియా ఇల్లు కావాలి.. హోటల్ కాదు'' అని వ్యాఖ్యానించారు.

భారతీయుల సంఖ్య భారీగా పెరిగిన సమయంలో ఈ ప్రతిపాదన రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఆస్ట్రేలియా బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రకారం.. 2025 జూన్ 30 నాటికి ఆస్ట్రేలియాలో భారత్‌లో జన్మించిన వారి సంఖ్య 9,71,020గా ఉంది.

దీంతో 9,70,950 మందిగా ఉన్న ఇంగ్లాండ్‌లో జన్మించిన వారి సంఖ్యను భారత్‌ తొలిసారిగా అధిగమించింది.

దీంతో ఆస్ట్రేలియాలో అత్యధికంగా విదేశాల్లో జన్మించిన ప్రజలున్న దేశంగా భారత్‌ నిలిచింది.

2015లో ఆస్ట్రేలియాలో భారత్‌లో జన్మించిన వారి సంఖ్య సుమారు 4.49 లక్షలు ఉండగా.. 2025 నాటికి అది 9,71,020కు చేరింది.

వివరాలు 

భారతీయ విద్యార్థులు,ఉద్యోగులపై ప్రభావం

అంటే పదేళ్లలో సుమారు 5.22 లక్షల మంది పెరిగారు. 2025లో భారత్‌లో జన్మించిన వారు ఆస్ట్రేలియా మొత్తం జనాభాలో 3.5 శాతంగా, విదేశాల్లో జన్మించిన జనాభాలో సుమారు 11 శాతంగా ఉన్నారు.

భారతీయ విద్యార్థులు, నైపుణ్య ఉద్యోగులపై కూడా తాజా ప్రతిపాదన ప్రభావం చూపే అవకాశం ఉంది.

అంతర్జాతీయ విద్యార్థుల ప్రవేశాలు, తాత్కాలిక గ్రాడ్యుయేట్ వీసాలతో పాటు పలు తాత్కాలిక వలస మార్గాల్లో మార్పులు చేయాలని కూటమి ప్రతిపాదించింది.

ఏడాదికి అంతర్జాతీయ విద్యార్థుల కొత్త ప్రవేశాలను 2.40 లక్షలకు పరిమితం చేయాలని, విద్యార్థులతో వచ్చే చాలా మంది డిపెండెంట్లపై ఆంక్షలు విధించాలని భావిస్తోంది.

ADVERTISEMENT

వివరాలు 

భారతీయ విద్యార్థులు,నైపుణ్య ఉద్యోగులపై ప్రభావం

అలాగే చాలా వరకు తాత్కాలిక గ్రాడ్యుయేట్ వీసాలను రద్దు చేయాలని ప్రతిపాదించింది.

అయితే ఆరోగ్యం, విద్య, పీహెచ్‌డీ పూర్తిచేసిన వారు, ప్రాంతీయ విశ్వవిద్యాలయాలకు సంబంధించిన కొన్ని విభాగాలకు మినహాయింపులు ఇవ్వాలని భావిస్తోంది.

ఆస్ట్రేలియాలో భారతీయ విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఉండటంతో ఈ మార్పులు వారికి ప్రాధాన్యం కలిగించనున్నాయి.

అదే సమయంలో నిర్మాణ రంగం వంటి కీలక విభాగాల్లో నైపుణ్యం ఉన్న ఉద్యోగులను ఆకర్షించడంపై దృష్టి పెట్టాలని కూటమి చెబుతోంది.

తాత్కాలిక నైపుణ్య వలసలను పెంచుతూ.. ఉద్యోగుల నైపుణ్యాలు, దేశ ఆర్థిక వ్యవస్థకు వారు అందించే సహకారం వంటి అంశాల ఆధారంగా ప్రాధాన్యం ఇవ్వాలని ప్రతిపాదించింది.

ADVERTISEMENT

వివరాలు 

తాత్కాలిక నైపుణ్య వీసాల్లో భారతీయులే అగ్రస్థానం

ప్రస్తుతం తాత్కాలిక నైపుణ్య వీసాలు పొందుతున్నవారిలో భారతీయులు అగ్రస్థానంలో ఉన్నారు.

ఆస్ట్రేలియా హోం అఫైర్స్ గణాంకాల ప్రకారం.. 2025 డిసెంబర్ 31తో ముగిసిన ఆరు నెలల్లో భారత పౌరులకు 6,220 ప్రాథమిక తాత్కాలిక నైపుణ్య వీసాలు మంజూరయ్యాయి.

మొత్తం వీసాల్లో ఇది 18.1 శాతం. అంతకుముందు ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఈ సంఖ్య 16.2 శాతం పెరిగింది.

మరోవైపు ఆస్ట్రేలియాలో అధికారంలో ఉన్న లేబర్ ప్రభుత్వం కూడా ఇప్పటికే వలస నిబంధనలను కఠినతరం చేస్తోంది.

వివరాలు 

ఆస్ట్రేలియాలో కఠినతరమవుతున్న వీసా నిబంధనలు

అక్టోబర్ 2 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త విద్యార్థి వీసా నిబంధనల ప్రకారం.. దేశంలోనే ఉండి విద్యార్థి వీసాకు దరఖాస్తు చేసుకునే అవకాశాలను పరిమితం చేశారు.

అలాగే చాలా మంది విద్యార్థులు తమ కుటుంబ సభ్యులను ఆస్ట్రేలియాకు తీసుకురావడంపైనా ఆంక్షలు విధించారు.

వీసా నిబంధనలను దుర్వినియోగం చేస్తూ ఒక వీసా నుంచి మరో వీసాకు మారడాన్ని,అలాగే వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్న వలస ఏజెంట్లను కూడా ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుంది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నికర విదేశీ వలసలను 2,45,000కు, 2027-28 ఆర్థిక సంవత్సరంలో 2,25,000కు తగ్గించాలని లేబర్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

ADVERTISEMENT