Australia: ఆస్ట్రేలియాలో 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం అమల్లోకి..
ఈ వార్తాకథనం ఏంటి
ఆస్ట్రేలియాలో 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం అమల్లోకి వచ్చింది. ప్రపంచంలో తొలిసారి పిల్లలపై ఇలాంటి నిషేధాన్ని అమలు చేసిన దేశంగా ఆస్ట్రేలియా నిలిచింది. బుధవారం (డిసెంబర్ 10) నుంచి అమలులోకి వచ్చిన ఈ చట్టం ప్రకారం టిక్ టాక్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్ బుక్ సహా 10 ప్రధాన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లకు 16 ఏళ్లలోపు పిల్లలు లాగిన్ కావడం పూర్తిగా నిషేధం. ఈ అర్ధరాత్రి నుంచి వయస్సు నిర్ధారణ ఆధారంగా ప్రవేశాన్ని అడ్డుకోకపోతే సంబంధిత కంపెనీలపై గరిష్టంగా AUD 49.5 మిలియన్ (సుమారు 33 మిలియన్ డాలర్లు) వరకు జరిమానా విధించే అవకాశం ఉందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
వివరాలు
ఆస్ట్రేలియా తీసుకున్న పరిమితి నిర్ణయాన్ని పరిశీలిస్తున్న ఇతర దేశాలు
ప్రధాని ఆంథనీ ఆల్బనీస్ ఈ చట్టాన్ని ఆస్ట్రేలియా కుటుంబాలకు గొప్ప విజయంగా ప్రకటిస్తూ, పెద్ద టెక్ కంపెనీల చేతుల్లోకి వెళ్లిపోయిన పిల్లల భద్రతను మళ్లీ కుటుంబాల చేతికి తీసుకొచ్చిన రోజుగా అభివర్ణించారు. ఆన్‌లైన్ వల్ల పెరుగుతున్న హానికర పరిస్థితులను కట్టడి చేయడం ప్రభుత్వాల వల్ల సాధ్యమవుతుందనడానికి ఇదే నిదర్శనమని ఆయన అన్నారు. పాఠశాలల్లో ప్రదర్శించే వీడియో ద్వారా కూడా పిల్లలకు కొత్త క్రీడ మొదలు పెట్టాలని, సంగీత వాయిద్యం నేర్చుకోవాలని, పుస్తకాలు చదవాలని ఆయన పిలుపునిచ్చారు. ఇదిలా ఉండగా, 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వాడకంపై ఆస్ట్రేలియా తీసుకున్న పరిమితి నిర్ణయాన్ని డెన్మార్క్, న్యూజిలాండ్, మలేసియా వంటి దేశాలు గమనిస్తూ, తమ దేశాల్లో అమలు చేయగలమా అని పరిశీలిస్తున్నాయి.
వివరాలు
ఈ నిషేధం వల్ల యువతలో ఆందోళన
టెక్ కంపెనీలు,స్వేచ్ఛా భావప్రకటనకు మద్దతు పలికే వర్గాలు ఈ చట్టంపై విమర్శలు చేస్తున్నప్పటికీ,తల్లిదండ్రులు,చిన్నారుల హితవాదులు దీనిని స్వాగతిస్తున్నారు. ఎలాన్ మస్క్‌కు చెందిన'ఎక్స్'ప్లాట్‌ఫారమ్ కూడా ఈ నిబంధనలకు అంగీకరించగా,"ఇది మా ఇష్టం కాదు...ఆస్ట్రేలియా చట్టం ఆదేశం"అని వెబ్‌సైట్‌లో స్పష్టం చేసింది. కొత్త నిబంధనలకు అనుగుణంగా వయస్సును అంచనా వేసే పద్ధతులతో నిబంధనలు పాటిస్తామని కంపెనీలు ప్రభుత్వానికి తెలిపారు. అయితే ఈ నిషేధం వల్ల యువతలో ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. 14 ఏళ్ల బాలిక అన్నీ వాంగ్ మాట్లాడుతూ, ప్రత్యేక ఆసక్తులు ఉన్నవారు,ఎల్‌జీబీటీక్యూ వర్గాలకు చెందిన యువత తమలాంటి వ్యక్తులతో కలిసే ఏకైక మార్గం సోషల్ మీడియానేనని,నిషేధం వల్ల ఒంటరిగా మారే ప్రమాదం ఉందని, మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడొచ్చని ఆవేదన వ్యక్తం చేసింది.