Bahamas: బహామాస్‌లో సముద్రంలో కుప్పకూలిన విమానం.. 10 మంది మృతి
ఈ వార్తాకథనం ఏంటి
బహామాస్‌లో శుక్రవారం ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. 10 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్న ఓ చిన్న విమానం సముద్రంలో కుప్పకూలడంతో అందులో ఉన్న వారందరూ ప్రాణాలు కోల్పోయారు. దేశం 53వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ విషాదం చోటుచేసుకోవడంతో బహామాస్ అంతటా తీవ్ర దిగ్భ్రాంతి నెలకొంది. ఘటన అనంతరం ప్రభుత్వం వెంటనే స్పందించి, సంబంధిత విమానయాన సంస్థ ఫ్లెమింగో ఎయిర్ సేవలను తాత్కాలికంగా నిలిపివేసింది. రాజధాని నసావులోని లిండెన్ పిండ్లింగ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సెస్నా 402 రకం విమానం శాన్ ఆండ్రోస్ ద్వీపానికి బయలుదేరింది. అయితే టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే నసావుకు పశ్చిమ దిశలోని నార్త్ ఆండ్రోస్ సముద్ర జలాల్లో విమానం కుప్పకూలింది.
వివరాలు
స్వాతంత్ర్య దినోత్సవం శోకదినంగా మారింది: ప్రధాని
ప్రమాదం జరిగిన వెంటనే ఒకరు ప్రాణాలతో బయటపడ్డారని బహామాస్ ప్రధాని ఫిలిప్ బ్రేవ్ డెవిస్ తొలుత వెల్లడించారు. అయితే తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆ వ్యక్తి కూడా అనంతరం మృతి చెందినట్లు అధికారులు ధ్రువీకరించారు. దీంతో ఈ ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 10కు చేరింది. స్వాతంత్ర్య దినోత్సవం శోకదినంగా మారిందని ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా, అదే రోజు ఫ్లెమింగో ఎయిర్‌కు చెందిన మరో విమానం కూడా ప్రమాదానికి గురికావడం ఆందోళన కలిగించింది. మాయాగువానా ద్వీపానికి వెళ్లాల్సిన ఆ విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో పైలట్ అప్రమత్తంగా వ్యవహరించి, అత్యవసరంగా తిరిగి నసావు విమానాశ్రయంలో ల్యాండ్ చేశాడు.
వివరాలు
బహామాస్ ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ అథారిటీ సమగ్ర దర్యాప్తు
ప్రయాణికులందరినీ సురక్షితంగా దింపిన కొద్దిసేపటికే ఆ విమానంలో మంటలు చెలరేగాయి. ఒకే రోజు ఒకే విమానయాన సంస్థకు చెందిన రెండు ఘటనలు చోటుచేసుకోవడంతో భద్రతా అంశాలను దృష్టిలో ఉంచుకుని ఫ్లెమింగో ఎయిర్ కు జారీ చేసిన ఎయిర్ ఆపరేటర్ సర్టిఫికేట్ ను తాత్కాలికంగా రద్దు చేసినట్లు బహామాస్ విమానయాన మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ రెండు ఘటనలపై బహామాస్ ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ అథారిటీ సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది.