Baloch Leaders: బలూచిస్థాన్‌లో పాక్ దాడులు.. ట్రంప్ జోక్యం చేసుకోవాలని బలోచ్ నేతల లేఖ
ఈ వార్తాకథనం ఏంటి
బలూచిస్థాన్‌లో పాకిస్థాన్ సైన్యం జరిపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వైమానిక దాడులపై వివాదం మరింత ముదిరింది. ఈ దాడుల్లో 30 మందికి పైగా పౌరులు మరణించారని బలోచ్ వర్గాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో.. బలోచ్ అమెరికన్ కాంగ్రెస్ అధ్యక్షుడు తారా చంద్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు లేఖ రాశారు. ఘటనపై అమెరికా తక్షణమే జోక్యం చేసుకుని వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని, పాకిస్థాన్ చర్యలపై అంతర్జాతీయ స్థాయిలో ఒత్తిడి తీసుకురావాలని ఆయన కోరారు. ఆగస్టు 12వ తేదీ తెల్లవారుజామున సురబ్ జిల్లాలోని గిదర్ ప్రాంతంలో నివాస గృహాలను పాకిస్థాన్ వైమానిక దళం లక్ష్యంగా చేసుకుని విచక్షణారహితంగా బాంబులు వేసిందని బలోచ్ సంఘాలు ఆరోపిస్తున్నాయి.
వివరాలు
తారా చంద్ లేఖలో పలు కీలక అంశాలు
ఈ ఘటనలో మహిళలు, చిన్నారులు సహా పలువురు పౌరులు ప్రాణాలు కోల్పోయారని, భారీగా ఆస్తి నష్టం సంభవించిందని పేర్కొన్నాయి.
ఈ నేపథ్యంలో తారా చంద్ తన లేఖలో పలు కీలక అంశాలను ప్రస్తావించారు.
ఈ తీవ్రమైన ఆరోపణలపై అమెరికా ప్రభుత్వం విచారణ చేపట్టాలని ఆయన కోరారు.
దాడుల్లో అమెరికాకు చెందిన విమానాలు, ఆయుధాలు, డ్రోన్లు, సాంకేతికత లేదా ఇతర సైనిక పరికరాలు ఏమైనా వినియోగించారా అనే విషయాన్ని నిర్ధారించాలని విజ్ఞప్తి చేశారు.
అమెరికా సరఫరా చేసిన ఆయుధాలను పాకిస్థాన్ దుర్వినియోగం చేసినట్లు ఆధారాలు లభిస్తే.. ఆ దేశానికి అందిస్తున్న సైనిక సహాయాన్ని సమీక్షించాలని కోరారు.
వివరాలు
బలోచ్ చిన్నారి ప్రాణం కూడా అంతే విలువైనది
అంతర్జాతీయ మానవతా చట్టాల ఉల్లంఘనకు సంబంధించిన ఆరోపణలపై స్వతంత్ర దర్యాప్తునకు అమెరికా మద్దతు ఇవ్వాలని కూడా తారా చంద్ విజ్ఞప్తి చేశారు.
ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకునేలా చూడాలని కోరారు.
ప్రపంచంలోని ఏ చిన్నారి ప్రాణమైనా ఎంత విలువైనదో.. బలోచ్ చిన్నారి ప్రాణం కూడా అంతే విలువైనదని ఆయన తన లేఖలో పేర్కొన్నారు.
ముందుగానే ఏ నిర్ణయానికీ రావాలని తాము అమెరికాను కోరడం లేదని, వాస్తవాలను నిర్ధారించి పౌరులను రక్షించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మాత్రమే కోరుతున్నామని స్పష్టం చేశారు.
వివరాలు
పాక్ వాదనను ఖండించిన బలోచ్ సంఘాలు
మరోవైపు బలోచ్ వర్గాలు చేసిన ఆరోపణలను పాకిస్థాన్ సైన్యానికి చెందిన మీడియా విభాగం ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ఐఎస్‌పీఆర్) తీవ్రంగా ఖండించింది.
అసలు అది వైమానిక దాడి కాదని పాక్ సైన్యం తెలిపింది.
ఓ ఉగ్రవాద సంస్థకు చెందిన వాహనంలో అమర్చిన శక్తిమంతమైన బాంబు అనుకోకుండా పేలిపోవడం వల్లే ఈ దుర్ఘటన చోటుచేసుకుందని వివరణ ఇచ్చింది.
అయితే పాక్ సైన్యం ఇచ్చిన ఈ వివరణను బలోచ్ కార్యకర్తలు, మానవ హక్కుల సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి.
ఐఎస్‌పీఆర్ ప్రకటన పూర్తిగా అబద్ధం, కల్పితమని కొట్టిపారేశాయి. వివాదాస్పద సైనిక చర్యల విషయంలో పాక్ సైనిక ప్రతినిధి కార్యాలయం తప్పుడు ప్రకటనలు చేయడంలో పేరుగాంచిందని బలోచ్ మానవ హక్కుల కార్యకర్త మీర్ యార్ బలోచ్ 'ఎక్స్'లో ఆరోపించారు.
వివరాలు
పాకిస్థాన్, బలోచ్ వర్గాల పరస్పర విరుద్ధ ఆరోపణలు
సురబ్ ఘటనను ఆయన సామూహిక శిక్షగా అభివర్ణించారు.
పాక్ వైమానిక దళం చీకటి మాటున ఉద్దేశపూర్వకంగా పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడి చేసిందని, దీనికి స్థానిక ప్రజలే సాక్షులని పేర్కొన్నారు.
మరోవైపు 'బలోచ్ వాయిస్ ఫర్ జస్టిస్' (బీవీజే) సంస్థ కూడా పాకిస్థాన్ సైన్యం బలూచిస్థాన్‌లో చేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న యుద్ధ నేరాలను కప్పిపుచ్చుకునేందుకే ఇలాంటి కథనాలను ప్రచారం చేస్తోందని ఆరోపించింది.
అయితే ఈ ఘటనకు సంబంధించి పాకిస్థాన్, బలోచ్ వర్గాలు చేస్తున్న పరస్పర విరుద్ధ ఆరోపణల నేపథ్యంలో.. అసలు ఏం జరిగిందనే అంశంపై స్వతంత్ర దర్యాప్తు అవసరమన్న డిమాండ్లు మరింతగా వినిపిస్తున్నాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
తారా చంద్ చేసిన ట్వీట్
Today, on behalf of the Baloch American Congress, I sent the attached letter to President Donald J. Trump requesting an urgent U.S. investigation into the reported Pakistani military airstrikes in Surab, Balochistan, which reportedly killed innocent civilians, including children,… pic.twitter.com/kAh31AQhK6
— Dr. Tara Chand Baloch (@drtchand) August 18, 2026