Loading...
Italy: ఇటలీ పాఠశాలల్లో బురఖా, నిఖాబ్‌పై నిషేధం.. ఉల్లంఘిస్తే భారీ జరిమానా!
ఇటలీ పాఠశాలల్లో బురఖా, నిఖాబ్‌పై నిషేధం.. ఉల్లంఘిస్తే భారీ జరిమానా!

Italy: ఇటలీ పాఠశాలల్లో బురఖా, నిఖాబ్‌పై నిషేధం.. ఉల్లంఘిస్తే భారీ జరిమానా!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 28, 2026
05:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇటలీ పార్లమెంట్ పాఠశాలల్లో వివాదాస్పద విద్యా సంస్కరణల బిల్లుకు తుది ఆమోదం తెలిపింది. ఈ కొత్త చట్టం ప్రకారం పాఠశాల కార్యకలాపాల్లో పాల్గొనే సమయంలో విద్యార్థులు ముఖాన్ని పూర్తిగా కప్పి ఉంచే బురఖా, నిఖాబ్ వంటి వస్త్రాలను ధరించడంపై నిషేధం విధించారు. గుర్తింపు తెలియకుండా ముఖాన్ని కప్పే ఏ వస్త్రాన్నీ పాఠశాలల్లో అనుమతించరు. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారికి 1,000 యూరోలు (సుమారు 1,100 అమెరికన్ డాలర్లు) వరకు జరిమానా విధించనున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన విద్యార్థి మైనర్ అయితే.. ఆ జరిమానాను వారి తల్లిదండ్రులు లేదా సంరక్షకులు చెల్లించాల్సి ఉంటుంది.

వివరాలు

విదేశీ విద్యార్థులకు 30 శాతం పరిమితి

ఈ చట్టంలో మరో కీలక నిబంధనను కూడా చేర్చారు. మొదటి సంవత్సరం తరగతుల్లో విదేశీ మూలాలున్న విద్యార్థుల సంఖ్యను 30 శాతానికి పరిమితం చేశారు.

అయితే ఇటాలియన్ భాషపై ఇప్పటికే తగినంత పట్టు సాధించిన విదేశీ విద్యార్థులకు ఈ పరిమితి నుంచి మినహాయింపు కల్పించారు.

విదేశీ విద్యార్థుల తల్లిదండ్రుల కోసం ప్రత్యేక ఇటాలియన్ భాషా కోర్సులను కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టింది.

నవంబర్ 20న సెనేట్ ఆమోదం పొందిన ఈ బిల్లు.. నవంబర్ 26న దిగువ సభ అయిన ఛాంబర్ ఆఫ్ డిప్యూటీస్‌లో 142 ఓట్ల అనుకూలతతో ఆమోదం పొందింది.

వివరాలు

మెలోని ప్రభుత్వం లక్ష్యమిదే..

2026-2027 విద్యా సంవత్సరాన్ని సజావుగా ప్రారంభించడంతో పాటు విదేశీ విద్యార్థుల ఏకీకరణను ప్రోత్సహించే ఉద్దేశంతో ప్రధాని జార్జియా మెలోని ప్రభుత్వం ఈ విస్తృత విద్యా సంస్కరణలను తీసుకొచ్చింది.

అయితే ఈ చట్టంపై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ముస్లిం విద్యార్థులు, విదేశీ కుటుంబాలపై వివక్షను ప్రోత్సహించేలా ఈ నిబంధనలు ఉన్నాయని, మతపరమైన స్వేచ్ఛను హరిస్తున్నాయని మండిపడుతున్నాయి.

ఓటింగ్ సమయంలో ప్రతిపక్ష ఎంపీలు "పాఠశాలలో ఎవరూ విదేశీయులు కారు" అనే ప్లకార్డులను ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు.

ఇటలీ విద్యావ్యవస్థ ఎదుర్కొంటున్న అసలు సమస్యలను పరిష్కరించకుండా.. విద్యార్థుల మధ్య విభజన తీసుకొచ్చేలా ఈ చట్టం ఉందని ప్రతిపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ADVERTISEMENT