LOADING...
Sheikh Hasina: షేక్ హసీనా శపథం.. నేను మళ్లీ బంగ్లాదేశ్‌లో అడుగుపెపెట్టానంటే.. ప్రతీకారం తీర్చుకుంటా
షేక్ హసీనా శపథం.. నేను మళ్లీ బంగ్లాదేశ్‌లో అడుగుపెపెట్టానంటే..

Sheikh Hasina: షేక్ హసీనా శపథం.. నేను మళ్లీ బంగ్లాదేశ్‌లో అడుగుపెపెట్టానంటే.. ప్రతీకారం తీర్చుకుంటా

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 18, 2025
12:18 pm

ఈ వార్తాకథనం ఏంటి

బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్‌ యూనస్‌ (Muhammad Yunus) ను ఉగ్రవాదిగా పేర్కొంటూ, ఆ దేశ మాజీ ప్రధాని షేక్‌ హసీనా (Sheikh Hasina) తీవ్ర విమర్శలు చేశారు. అవామీ లీగ్‌ పార్టీ కార్యకర్తలు నిర్వహించిన ఒక బహిరంగ సమావేశంలో, హసీనా జూమ్‌కాల్‌ ద్వారా హాజరై, కార్యకర్తలకు సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా, తాను బంగ్లాదేశ్‌ కు తిరిగి వస్తానని, పార్టీ కార్యకర్తల మరణాలకు ప్రతీకారం తీర్చుకుంటానని హసీనా ప్రతిజ్ఞ చేశారు.

వివరాలు 

 కార్యకర్తల మృతికి ప్రతీకారం తీర్చుకుంటా

హసీనా మాట్లాడుతూ, "అవామీ లీగ్‌ పార్టీ నాయకులు ఓపికగా, ఐక్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. నేను నా దేశానికి తిరిగి వచ్చి, పార్టీ కార్యకర్తల మృతికి ప్రతీకారం తీర్చుకుంటా. గతంలో మాదిరిగానే అందరికీ న్యాయం చేస్తా. జులై-ఆగస్టులో జరిగిన నిరసనలలో మరణించినవారు పోలీసుల కాల్పుల కారణంగా చనిపోలేదు. ఇప్పుడు పోస్టుమార్టం నిర్వహిస్తే నిజాలు బయట పడతాయి. విద్యార్థులు చేసిన ఆందోళనలో పలువురు పోలీసులు, అవామీ లీగ్‌ కార్యకర్తలు, విద్యావంతులు, కళాకారులు హత్యకు గురయ్యారు. అయినప్పటికీ, యూనస్‌ వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు?" అని ప్రశ్నించారు.

వివరాలు 

ఆర్థిక వ్యవస్థ పతనంలో ఉంది

"యూనస్‌ అన్నీ విచారణ కమిటీలను రద్దు చేసి దేశాన్ని నాశనం చేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలపై, అధికారులపై దాడులు చేయడం, యూనస్‌ అసమర్థతకు నిదర్శనం. నా తండ్రి నివాసం ప్రణాళికాబద్ధంగానే ధ్వంసం చేశారు. మధ్యంతర ప్రభుత్వం ఏర్పడినప్పటికీ, అల్లర్లతో దేశం ఆందోళనలో ఉంది. ఆర్థిక వ్యవస్థ పతనంలో ఉంది, ప్రజల భద్రత ప్రమాదంలో ఉంది. ఈ ఉగ్రవాద ప్రభుత్వాన్ని తరిమివేయాలి" అని ఆమె పేర్కొన్నారు. బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళన నేపథ్యంలో, గత ఏడాది ఆగస్టు 5న షేక్‌ హసీనా దేశాన్ని వదిలి, భారత్‌లో ఆశ్రయం పొందారు. ఆమెపై నేరారోపణలు నమోదయ్యాయి. ఢాకా కేంద్రంగా ఉన్న ఇంటర్నేషనల్‌ క్రైమ్స్‌ ట్రైబ్యునల్‌ (ICT) ఆమెకు అరెస్టు వారెంట్‌ జారీ చేసింది.

వివరాలు 

యూనస్‌ సర్కారు ఆపరేషన్ డెవిల్ హంట్‌

మరోవైపు, యూనస్‌ సర్కారు ఆపరేషన్ డెవిల్ హంట్‌ను ప్రారంభించింది. ఈ ఆపరేషన్ ద్వారా, దేశాన్ని అస్థిరపరిచే కుట్రదారులను, చట్ట ఉల్లంఘనకు పాల్పడేవారిని లక్ష్యంగా చేసిందని బంగ్లా హోం మంత్రి చెప్పారు. అలాగే, హసీనా ప్రభుత్వంలో పనిచేసిన 41 మంది పోలీసు అధికారులను సోమవారం బంగ్లా ప్రభుత్వం అరెస్టు చేసింది. విద్యార్థుల ఆందోళన సమయంలో వారిని అణచివేశారని ఆరోపణలు ఉన్నాయి. 1059 మంది పోలీసు అధికారులను, సిబ్బందిని ఉద్యోగాల నుంచి తొలగించడం జరిగింది.