Bangladesh: పాఠశాలల్లో మ్యూజిక్, పీఈటీ టీచర్ల నియామకాలను బంద్ చేసిన బంగ్లా ప్రభుత్వం
ఈ వార్తాకథనం ఏంటి
బంగ్లాదేశ్‌లోని పాఠశాలల్లో సంగీతం, శారీరక విద్యా (పీఈటీ) ఉపాధ్యాయుల నియామకాలను రద్దు చేస్తున్నట్లు అక్కడి తాత్కాలిక ప్రభుత్వం ప్రకటించింది. ఇటీవల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో సంగీతం, నృత్యం వంటి కళలకు ప్రాధాన్యం ఇచ్చేందుకు ఈ పోస్టులను సృష్టించాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. అయితే, ఈ నిర్ణయం ఇస్లాం వ్యతిరేక అజెండాగా ఉందని తీవ్రంగా వ్యతిరేకించిన బంగ్లా ఇస్లామిక్ ఛాందసవాదులు (Bangladesh Islamists)ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. దీంతో యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం వెనక్కి తగ్గి, ఈ నియామకాలను పూర్తిగా రద్దు చేస్తోందని విద్యాశాఖ అధికారి మసూద్ అక్తర్ ఖాన్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఈ నిర్ణయం వెనుక ఉన్న కారణాలను మీడియా ప్రశ్నించగా, అక్తర్ ఖాన్ సమాధానం ఇవ్వడానికి నిరాకరించారు.
Details
మతపరమైన ఒత్తిడి పెరుగుతోంది
అయితే, స్థానిక మీడియా కథనాల ప్రకారం యూనస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి బంగ్లాదేశ్‌లో ప్రభుత్వ నిర్ణయాలపై ఇస్లామిక్ ఛాందసవాదుల ప్రభావం గణనీయంగా పెరిగిపోయింది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో కేవలం మతపరమైన ఉపాధ్యాయులనే నియమించాలని, మ్యూజిక్ మరియు పీఈటీ టీచర్ల నియామకాలను పూర్తిగా రద్దు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తమ డిమాండ్లు అమలు చేయకపోతే వీధుల్లోకి వచ్చి భారీ నిరసనలు చేపడతామని హెచ్చరించారు. ఇటీవలి కాలంలో మహిళలకు సమాన హక్కులు కల్పించాలని చేసిన ప్రభుత్వ సిఫార్సులను కూడా ఇస్లామిస్ట్ గ్రూప్ హెఫాజత్-ఎ-ఇస్లాం తీవ్రంగా వ్యతిరేకించింది. దీంతో బంగ్లాదేశ్ ప్రభుత్వంపై మతపరమైన ఒత్తిడి మరింతగా పెరుగుతోందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.