LOADING...
Zakir Naik: భారత్‌ వాంటెడ్‌గా ఉన్న జకీర్‌ నాయక్‌కు బంగ్లాదేశ్‌ అధికారిక ఆహ్వానం!
భారత్‌ వాంటెడ్‌గా ఉన్న జకీర్‌ నాయక్‌కు బంగ్లాదేశ్‌ అధికారిక ఆహ్వానం!

Zakir Naik: భారత్‌ వాంటెడ్‌గా ఉన్న జకీర్‌ నాయక్‌కు బంగ్లాదేశ్‌ అధికారిక ఆహ్వానం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 27, 2025
03:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

వివాదాస్పద మత బోధకుడు జకీర్‌ నాయక్‌ (Zakir Naik) మళ్లీ అంతర్జాతీయ వేదికపై నిలుస్తున్నారు. తాజాగా ఆయన బంగ్లాదేశ్‌లో పర్యటించనున్నట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి. ఈ పర్యటనకు నోబెల్‌ బహుమతి గ్రహీత, బంగ్లా తాత్కాలిక ప్రభుత్వ అధినేత ముహమ్మద్‌ యూనస్‌ (Muhammad Yunus) అనుమతి ఇచ్చినట్లు సమాచారం. జకీర్‌కు అధికారికంగా స్వాగతం పలకడానికి బంగ్లా ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. నవంబర్‌ 28 నుంచి డిసెంబర్‌ 20 వరకు కొనసాగనున్న ఈ పర్యటనలో భాగంగా జకీర్‌ బంగ్లాలోని పలు నగరాలను సందర్శించనున్నారు. ప్రజలనుద్దేశించి మత బోధనలపై ప్రసంగాలు చేయడానికి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Details

మలేషియాలో తల దాచుకున్నట్లు సమాచారం

జకీర్‌ నాయక్‌ పేరు వివాదాల్లోకి రావడానికి కారణం 2016 జూలైలో ఢాకా బేకరీపై జరిగిన ఉగ్రదాడి. ఆ దాడిలో పాల్గొన్న ఉగ్రవాది ఒకరు, జకీర్‌ నాయక్‌ యూట్యూబ్‌ బోధనల ప్రభావంతోనే తాను ఈ మార్గం ఎంచుకున్నానని అంగీకరించాడు. అదే సమయంలో భారత్‌లో ఉన్న జకీర్‌, అరెస్టు భయంతో మలేసియాకు పారిపోయి అక్కడే తలదాచుకున్నాడు. ఆ తర్వాత భారత ప్రభుత్వం అతనిపై మనీ లాండరింగ్‌ మరియు విద్వేష ప్రసంగాల కేసులు నమోదు చేసి వాంటెడ్‌గా ప్రకటించింది. అతడి చానల్‌ 'పీస్‌ టీవీ (Peace TV)'ను బంగ్లా మాజీ ప్రధాని షేక్‌ హసీనా (Sheikh Hasina) నిషేధించారు.

Details

రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ

ఇప్పుడు అదే బంగ్లాదేశ్‌లో యూనస్‌ ప్రభుత్వం ఆయనకు అధికారికంగా స్వాగతం పలకడం, రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసింది. ఇది బంగ్లా పాలక వర్గాల్లో వచ్చిన వైఖరి మార్పును సూచిస్తోంది. గతేడాది జకీర్‌ పాకిస్థాన్‌ పర్యటన కూడా వివాదాస్పదమైంది. అప్పటి ప్రధాని షహబాజ్‌ షరీఫ్‌ కూడా ఆయనకు స్వాగతం పలికారు. ఆ పర్యటనలో భాగంగా జకీర్‌ నిషేధిత ఉగ్ర సంస్థలకు చెందిన కొందరిని కలిసినట్లు నిఘా వర్గాలు పేర్కొన్నాయి. మొత్తంగా, జకీర్‌ నాయక్‌ తాజా బంగ్లాదేశ్‌ పర్యటన రాజకీయ, మత, భద్రతా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.