Mohammed Shahabuddin: బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహ్మద్ షాబుద్దీన్ రాజీనామా..
ఈ వార్తాకథనం ఏంటి
బంగ్లాదేశ్‌లో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. దేశ అధ్యక్షుడు మహ్మద్ షాబుద్దీన్ తన పదవికి రాజీనామా చేశారు. అనారోగ్య కారణాలతో అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. మాజీ న్యాయవాది అయిన మహ్మద్ షాబుద్దీన్ అవామీ లీగ్ పార్టీ తరఫున 2023 ఏప్రిల్‌లో బంగ్లాదేశ్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి అదే పదవిలో కొనసాగుతున్నారు. ఆయన పదవీకాలం 2028 ఏప్రిల్ వరకు కొనసాగాల్సి ఉన్నప్పటికీ, ముందుగానే పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. మాజీ ప్రధాని షేక్ హసీనా పదవీచ్యుతురాలైన తర్వాత నుంచి తాను అధ్యక్ష పదవి నుంచి వైదొలగాలని భావిస్తున్నట్లు షాబుద్దీన్ పలుమార్లు బహిరంగంగా వెల్లడించారు.
వివరాలు
మహ్మద్ యూనస్ ప్రభుత్వం అనేక ఇబ్బందులకు గురిచేసింది: షాబుద్దీన్
హసీనా దేశం విడిచి వెళ్లిన అనంతరం మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం తనను అనేక ఇబ్బందులకు గురిచేసిందని ఆయన గతంలో ఆరోపించారు.
అంతేకాకుండా, తాత్కాలిక ప్రభుత్వం తనకు తగిన గౌరవం ఇవ్వడం లేదని కూడా షాబుద్దీన్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఫిబ్రవరిలో బంగ్లాదేశ్‌లో ఎన్నికలు పూర్తయిన తర్వాత తన పదవికి రాజీనామా చేస్తానని అప్పుడే ప్రకటించారు.
అదే నెలలో తారిఖ్ రెహమాన్ బంగ్లాదేశ్ కొత్త ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ పరిణామాల నేపథ్యంలోనే షాబుద్దీన్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.
అయితే, ఆయన రాజీనామాపై బంగ్లాదేశ్ ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.