Bangladesh: షరీఫ్ ఉస్మాన్ మరణం తర్వాత బంగ్లాలో అల్లర్లు, భారత హైకమిషన్ లక్ష్యంగా నిరసనలు
ఈ వార్తాకథనం ఏంటి
బంగ్లాదేశ్‌లో ఇటీవల చోటుచేసుకున్న కాల్పుల ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇంక్విలాబ్ మంచ్ కన్వీనర్ షరీఫ్ ఉస్మాన్ బిన్ హైది, సింగపూర్‌లో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. అతడి మృతితో బంగ్లాదేశ్ రాజధాని ఢాకాతో పాటు పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో చత్తోగ్రామ్‌లోని భారత అసిస్టెంట్ హైకమిషన్ కార్యాలయాన్ని రాత్రి సుమారు 11 గంటల సమయంలో ఆందోళనకారులు ముట్టడించారు. ఈ సందర్భంగా భారత్, అవామీలీగ్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
వివరాలు
పత్రిక కార్యాలయంపై అల్లరిమూకలు దాడి
అల్లర్ల ఉధృతిలో పత్రికాకార్యాలయాలు కూడా లక్ష్యంగా మారాయి.ఢాకా కవ్రాన్ బజార్ ప్రాంతంలో ఉన్న డెయిలీస్టార్ పత్రిక కార్యాలయంపై అల్లరిమూకలు దాడి చేసి నిప్పంటించారు. గంటల తరబడి శ్రమించిన తరువాత సుమారు 25మంది జర్నలిస్టులను అగ్నికీలల నుంచి సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. వీరిలో మహిళా జర్నలిస్టులు కూడా ఉన్నారు. ఈఅగ్నిప్రమాదంలో భవనంలోని రెండు అంతస్తులు పూర్తిగా మంటల్లో చిక్కుకున్నాయి. ఇదే సమయంలో ప్రముఖ బెంగాలీ పత్రిక ప్రోథోమ్ అలో కార్యాలయంపై కూడా దుండగులు దాడులకు పాల్పడ్డారు. అల్లరిమూకలతో మాట్లాడి పరిస్థితిని శాంతింపజేయడానికి ప్రయత్నించిన న్యూఏజ్ పత్రిక ఎడిటర్ నూరుల్ కబీర్‌పైనా దాడి జరగడం కలకలం రేపింది. పరిస్థితులు అదుపు తప్పడంతో బంగ్లాదేశ్‌లోని ప్రధాన పత్రికలు నేటి నుంచి తమ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించుకున్నాయి.
వివరాలు
షరీఫ్ ఉస్మాన్ బిన్ హైదిపై గుర్తుతెలియని దుండగులు కాల్పులు
మరోవైపు, బంగ్లాదేశ్ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ ముజిబుర్ రహమాన్ కుటుంబానికి చెందిన ధన్‌మోండీ 32 ప్రాంతంలోని ఇంటిని ఆందోళనకారులు ధ్వంసం చేశారు. ప్రస్తుతం ఆ ఇంటిని మ్యూజియంగా ఉపయోగిస్తున్నారు. గత జులైలో అవామీలీగ్ నేత, ప్రధాని షేక్ హసీనాకు వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటులో షరీఫ్ ఉస్మాన్ బిన్ హైది కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. కొన్నాళ్ల క్రితం అతడు భారత్ వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం కూడా వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలో గత శుక్రవారం గుర్తుతెలియని దుండగులు అతడిపై కాల్పులు జరపగా, తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ చివరకు మృతి చెందాడు.