LOADING...
Khaleda Zia: బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని ఖలీదా జియా కన్నుమూత 
Khaleda Zia: బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని ఖలీదా జియా కన్నుమూత

Khaleda Zia: బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని ఖలీదా జియా కన్నుమూత 

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 30, 2025
08:10 am

ఈ వార్తాకథనం ఏంటి

బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని, బీఎన్‌పీ అధినేత్రి ఖలీదా జియా (80) మృతి చెందారు. గుండె, ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్‌ తీవ్రత పెరగడంతో నవంబర్‌ 23న ఢాకాలోని ఎవర్‌కేర్‌ ఆస్పత్రిలో ఆమెను చేర్చారు. పరీక్షల అనంతరం న్యుమోనియా సోకినట్లు వైద్యులు వెల్లడించారు. ఆ తర్వాత ఆమె ఆరోగ్యం వేగంగా క్షీణించింది. గుండె, కిడ్నీలు, కాలేయం, డయాబెటిస్‌, ఊపిరితిత్తులు తదితర సమస్యలు తీవ్రమయ్యాయి. ఈ పరిస్థితుల్లో మంగళవారం ఉదయం ఫజ్రు ప్రార్థనల అనంతరం ఉదయం 6 గంటల సమయంలో ఆమె తుదిశ్వాస విడిచారు.

వివరాలు 

 పదేళ్లపాటు ప్రధానిగా 

ఖలీదా జియా బంగ్లాదేశ్‌ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. 1991 నుంచి 1996 వరకు, అలాగే 2001 నుంచి 2006 వరకు ఆమె ప్రధానిగా సేవలందించారు. మొత్తం పదేళ్లపాటు దేశ పాలనను నడిపించారు. బంగ్లాదేశ్‌లో కేర్‌టేకర్‌ ప్రభుత్వ వ్యవస్థను తొలిసారి అమలు చేసిన నాయకురాలిగా ఆమె గుర్తింపు పొందారు. అవినీతి కేసులో 2018 నుంచి 2020 వరకు జైలుశిక్ష అనుభవించారు. ఆమె వ్యక్తిగత జీవితంలోనూ విషాదాలు ఎదురయ్యాయి. ఇటీవల ఆమె పెద్ద కుమారుడు తారిక్‌ రెహమాన్‌ 17 ఏళ్ల విరామం తర్వాత బంగ్లాదేశ్‌కు తిరిగి వచ్చారు. చిన్న కుమారుడు అరాఫత్‌ రెహమాన్‌ కోకో కొన్ని సంవత్సరాల క్రితం మలేసియాలో కన్నుమూశారు.

వివరాలు 

పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి పోరాటంలో పాల్గొన్న ఖలీదా జియా

1945లో వ్యాపారవేత్త సికందర్‌ కుటుంబంలో ఖలీదా జియా జన్మించారు. 1960లో జియావుర్‌ రెహమాన్‌ను వివాహం చేసుకున్నారు. బంగ్లా విమోచన యుద్ధ సమయంలో జియావుర్‌ రెహమాన్‌ పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి పోరాటంలో పాల్గొన్నారు. 1981లో ఆయన హత్యకు గురైన తర్వాత బీఎన్‌పీలో నాయకత్వ సంక్షోభం తలెత్తింది. ఈ పరిస్థితుల్లో ఖలీదా జియా పార్టీ బాధ్యతలు చేపట్టారు. అనంతరం పదేళ్ల తర్వాత ఆమె తొలిసారిగా బంగ్లాదేశ్‌ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు.

Advertisement