Loading...
Bangladesh: 'భారత్‌తో స్నేహమే కావాలి'.. హసీనా ప్రెస్‌మీట్‌కు ముందు బంగ్లాదేశ్ కీలక వ్యాఖ్యలు
హసీనా ప్రెస్‌మీట్‌కు ముందు బంగ్లాదేశ్ కీలక వ్యాఖ్యలు

Bangladesh: 'భారత్‌తో స్నేహమే కావాలి'.. హసీనా ప్రెస్‌మీట్‌కు ముందు బంగ్లాదేశ్ కీలక వ్యాఖ్యలు

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 05, 2026
12:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌లో ఆశ్రయం పొందుతున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా త్వరలో స్వదేశానికి తిరిగి వెళ్లే అవకాశాలపై చర్చ జరుగుతున్న వేళ, ఆమె బుధవారం మీడియా సమావేశంలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. భారత్‌తో ఉన్న స్నేహపూర్వక సంబంధాలను దెబ్బతీయాలనే ఉద్దేశం తమకు లేదని బంగ్లాదేశ్ విదేశాంగశాఖ సహాయ మంత్రి షామా ఒబేద్ స్పష్టం చేశారు. ఈ విషయంలో భారత్ కూడా తమ వైఖరిని అర్థం చేసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్‌లో ఉంటున్న షేక్ హసీనా,అలాగే అవామీ లీగ్‌కు చెందిన ఇతర నాయకులు అక్కడి నుంచి రాజకీయ ప్రకటనలు చేయడంపై తమ ఆందోళనలను ఇప్పటికే పలుమార్లు భారత ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినట్లు షామా ఒబేద్ వెల్లడించారు.

వివరాలు 

షేక్ హసీనా చేసే ప్రసంగాలు,ప్రకటనలు, ఇంటర్వ్యూల పై నిషేధం 

అయితే, హసీనా నిర్వహించనున్న మీడియా సమావేశానికి తమకు ఎలాంటి సంబంధం లేదని భారత్ ఇప్పటికే స్పష్టం చేసిన విషయాన్ని కూడా ఆయన గుర్తు చేశారు.

ఇదిలా ఉండగా, షేక్ హసీనా చేసే ప్రసంగాలు, ప్రకటనలు, ఇంటర్వ్యూలు, అలాగే ఆమెకు సంబంధించిన ఆడియో, వీడియో సందేశాలను ప్రచురించడం లేదా ప్రసారం చేయడాన్ని నిషేధిస్తున్నట్లు బంగ్లాదేశ్ ప్రభుత్వం ప్రకటించింది.

ఈ ఆదేశాలను ఉల్లంఘించే మీడియా సంస్థలు లేదా ఇతరులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

వివరాలు 

హసీనా ఏమి మాట్లాడనున్నారు..?

బంగ్లాదేశ్‌లో విద్యార్థుల ఉద్యమం అనంతరం అధికారాన్ని కోల్పోయి భారత్‌కు వచ్చిన తర్వాత షేక్ హసీనా మీడియాతో మాట్లాడడం ఇదే తొలిసారి కానుంది.

ఈ సమావేశంలో ఆమె వర్చువల్ విధానంలో పాల్గొననున్నారు.

స్వదేశానికి ఎప్పుడు తిరిగి వెళ్లనున్నారనే అంశంతో పాటు తన భవిష్యత్ రాజకీయ ప్రణాళికలపై కూడా ఆమె స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని సమాచారం.

ఈ కార్యక్రమంలో హసీనా కుమారుడు సాజీబ్ వాజెద్‌తో పాటు అవామీ లీగ్‌కు చెందిన పలువురు సీనియర్ నాయకులు కూడా పాల్గొనే అవకాశం ఉంది.

అయితే, ఈ మీడియా సమావేశం నిర్వహణలో భారత ప్రభుత్వానికి ఎలాంటి పాత్ర లేదని భారత విదేశాంగశాఖ మరోసారి స్పష్టం చేసింది.

దీనిని ఒక ప్రైవేటు మీడియా సంస్థ స్వతంత్రంగా నిర్వహిస్తోందని వెల్లడించింది.

ADVERTISEMENT