Bangladesh: నేడు బంగ్లాదేశ్‌లో ఎన్నికలు.. బీఎన్‌పీ, జమాతే పార్టీల మధ్యే ప్రధాన పోరు
ఈ వార్తాకథనం ఏంటి
ఏడాదిన్నర క్రితం షేక్ హసీనా నేతృత్వంలోని ప్రభుత్వం కూలిన తర్వాత నుంచి బంగ్లాదేశ్ తీవ్ర రాజకీయ అస్థిరతను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో గురువారం అక్కడ సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల ద్వారా ప్రజలు కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోనున్నారు. 2024 ఆగస్టులో జరిగిన విద్యార్థుల ఉద్యమం ప్రభావంతో అవామీ లీగ్ ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయిన విషయం తెలిసిందే. ఆ తరువాత నుంచి దేశ పరిపాలనను మహమ్మద్ యూనస్ నాయకత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం చూసుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యాక ఢాకాలో కొత్త ప్రభుత్వం ఏర్పడనుంది.
వివరాలు
అవామీ లీగ్‌పై ప్రభుత్వం నిషేధం
ఈ ఎన్నికల్లో మొత్తం 299 పార్లమెంటు స్థానాలకు పోటీ జరుగుతుండగా, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన 1,981 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. దాదాపు 12.7 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. షేక్ హసీనా నాయకత్వంలోని అవామీ లీగ్‌పై ప్రభుత్వం నిషేధం విధించడంతో ఈసారి ప్రధానంగా బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ (బీఎన్‌పీ)తో పాటు షఫీకుర్ రెహమాన్ నేతృత్వంలోని జమాత్-ఎ-ఇస్లామీ కూటమి మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. విద్యార్థుల ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన నేషనల్ సిటిజన్ పార్టీ కూడా జమాత్ కూటమిలో భాగంగా ఉంది. ఎన్నికలతో పాటు కీలకమైన రాజ్యాంగ సవరణలపై కూడా రిఫరెండం నిర్వహించనున్నారు.
వివరాలు
హిందువులను లక్ష్యంగా చేసుకుని దాడులు
అవామీ లీగ్ పార్టీ లేకుండా బంగ్లాదేశ్‌లో ఎన్నికలు జరగడం ఇదే తొలిసారి. ప్రస్తుతం షేక్ హసీనా భారత్‌లో ఆశ్రయం పొందుతున్నట్లు సమాచారం. హసీనా ప్రభుత్వం కూలిన తరువాత దేశంలో మైనారిటీలపై, ముఖ్యంగా హిందువులను లక్ష్యంగా చేసుకుని దాడులు చోటుచేసుకున్నాయి. ఈసారి ఎన్నికల్లో మతతత్వ భావజాలం కలిగిన జమాత్-ఎ-ఇస్లామీ అధికారంలోకి వస్తే ఇటువంటి దాడులు మరింత పెరిగే అవకాశం ఉందని మైనారిటీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.