UN: ఐరాస వేదికపై ఇజ్రాయెల్ రాయబారి ఆగ్రహం.. 'నోరు మూసుకోండి.. లేదంటే బయటకు వెళ్లండి!'
ఈ వార్తాకథనం ఏంటి
ఐక్యరాజ్య సమితి (UN) వేదికపై దౌత్య మర్యాదలు పక్కనపడ్డాయి. ఇజ్రాయెల్‌ను లైంగిక హింస, చిన్నారుల హక్కుల ఉల్లంఘనలకు సంబంధించిన బ్లాక్‌లిస్టులో చేర్చడాన్ని వ్యతిరేకిస్తూ ఆ దేశ రాయబారి డ్యానీ డానన్ ఐరాస అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశం మధ్యలోనే ఓ ఉన్నతాధికారిణిపై ''నోరు మూసుకోండి.. లేదంటే బయటకు వెళ్లండి'' అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేయడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.
వివరాలు
సమావేశంలో ఏమి జరిగింది?
న్యూయార్క్‌లో శుక్రవారం 'సాయుధ ఘర్షణల్లో లైంగిక హింస నిర్మూలన దినోత్సవం' సందర్భంగా ఐరాస ప్రత్యేక సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా మాట్లాడిన ఇజ్రాయెల్ రాయబారి డ్యానీ డానన్.. ఇజ్రాయెల్‌ను లైంగిక హింసకు సంబంధించిన ఆరోపణల జాబితాలో చేర్చిన ఐరాస ప్రత్యేక ప్రతినిధి ప్రమీలా పాటెన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్ ఇజ్రాయెల్‌ను లక్ష్యంగా చేసుకుని వ్యవహరిస్తున్నారని ఆరోపించిన డానన్.. ప్రమీలా పాటెన్ కూడా అదే ధోరణిని అనుసరిస్తున్నారని విమర్శించారు. ఆమె తన పదవికి రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేశారు.
వివరాలు
అధికారిణి జోక్యంతో ఉద్రిక్తత
డానన్ ప్రసంగం జరుగుతుండగా చిన్నారులు, సాయుధ ఘర్షణలకు సంబంధించిన ఐరాస ప్రతినిధి వానెస్సా ఫ్రాజియర్ జోక్యం చేసుకున్నారు. వ్యక్తిగత విమర్శలు చేయవద్దని సూచించిన ఆమె.. నివేదికల్లో పేర్కొన్న అంశాలన్నీ ధ్రువీకరించిన ఆధారాల మేరకే నమోదు చేశామని స్పష్టం చేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన డానన్.. ''మేము ఐరాస సభ్య దేశం. మీరు కేవలం ఐరాస ఉద్యోగి మాత్రమే. మీ హద్దుల్లో మీరు ఉండాలి. ఇప్పుడు మీరు నోరు మూసుకోవాలి.. లేదంటే బయటకు వెళ్లండి. మీ నివేదిక సిగ్గుచేటు'' అంటూ ఘాటుగా స్పందించారు. దీంతో సమావేశ మందిరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
వివరాలు
వివాదానికి కారణం ఇదే..
ఇటీవల ఐరాస విడుదల చేసిన రెండు కీలక నివేదికల్లో ఇజ్రాయెల్‌ను తొలిసారిగా బ్లాక్‌లిస్టులో చేర్చింది. సాయుధ ఘర్షణల సమయంలో లైంగిక హింస, అలాగే చిన్నారుల హక్కుల ఉల్లంఘనలకు సంబంధించి ఇజ్రాయెల్‌పై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. గాజా యుద్ధం నేపథ్యంలో పాలస్తీనా చిన్నారులపై జరుగుతున్న ఉల్లంఘనలు గణనీయంగా పెరిగినట్లు కూడా ఐరాస పేర్కొంది. ఇదే జాబితాలో ఇజ్రాయెల్‌కు శత్రువైన హమాస్ సంస్థ కూడా కొనసాగుతోంది.
వివరాలు
నివేదికలపై ఇజ్రాయెల్ అసంతృప్తి
ఐరాస నివేదికలు వెలువడినప్పటి నుంచే ఇజ్రాయెల్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ నివేదికలు పక్షపాత ధోరణితో రూపొందించబడ్డాయని ఆరోపిస్తున్న ఆ దేశం.. ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్‌తో అధికారిక సంబంధాలను తెంచుకుంటామని కూడా హెచ్చరించింది. మరింత దిగజారనున్న ఐరాస-ఇజ్రాయెల్ సంబంధాలు? తాజా ఘటనతో ఇప్పటికే ఉద్రిక్తంగా ఉన్న ఐరాస-ఇజ్రాయెల్ సంబంధాలు మరింత దెబ్బతినే అవకాశాలు కనిపిస్తున్నాయి. గాజా యుద్ధం, మానవ హక్కుల ఉల్లంఘనల అంశాలపై ఇరువైపులా ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగుతున్న సమయంలో ఐరాస వేదికపై జరిగిన ఈ మాటల యుద్ధం ప్రపంచవ్యాప్తంగా దృష్టిని ఆకర్షిస్తోంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
''బయటకు వెళ్లండి.. నోరు మూసుకోండి''.. ఐరాసలో ఇజ్రాయెల్ రాయబారి
Israeli ambassador to the United Nations, Danny Danon, got in a shouting match with the U.N.'s special representative for children and armed conflict, Vanessa Frazier, after she interrupted his remarks at Friday's meeting regarding allegations that Israeli soldiers and settlers… pic.twitter.com/Qp8hEuN6HU
— CBS News (@CBSNews) June 20, 2026