LOADING...
Balloons: బెలారస్ వెదర్ బెలూన్ల ప్రయోగాలు.. లిథువేనియాలో విమాన సేవలకు అంతరాయం 
బెలారస్ వెదర్ బెలూన్ల ప్రయోగాలు.. లిథువేనియాలో విమాన సేవలకు అంతరాయం

Balloons: బెలారస్ వెదర్ బెలూన్ల ప్రయోగాలు.. లిథువేనియాలో విమాన సేవలకు అంతరాయం 

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 03, 2025
10:58 am

ఈ వార్తాకథనం ఏంటి

బెలూన్లు ఐరోపా ఖండంలోని రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. వీటివల్ల ప్రధాన ఎయిర్‌పోర్టులు తరచుగా మూతబడుతూ, ప్రయాణికులకు పెద్ద ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం, బెలారస్,లిథువేనియాల మధ్య ఈ సమస్య ఎక్కువగా ప్రతిబింబిస్తుంది. బెలారస్ వాతావరణ పరిస్థితులను అంచనా వేసేందుకు వెదర్ బెలూన్లను ప్రయోగిస్తోంది. అయితే, అవి నియంత్రణ తప్పి లిథువేనియా గగనతలంలోకి ప్రవేశించాయి. ఫలితంగా, లిథువేనియాలో విమాన సేవలు నిలిచిపోతున్నాయి. లిథువేనియా అధికారులు ఇటీవల బెలారస్ అటవీ ప్రాంతం వైపునుంచి వచ్చిన 60బెలూన్లలో 40అత్యంత కీలకమైన విమాన భద్రతా ప్రాంతంలోకి చేరాయని ఆరోపించారు. ఈ ఘటన కారణంగా విల్నియస్ ఎయిర్‌పోర్ట్‌లో 11 గంటలపాటు కార్యకలాపాలు నిలిపివేయవలసి వచ్చిందని వారు తెలిపారు, ఇది అత్యంత సీరియస్ సమస్యగా పేర్కొన్నారు.

వివరాలు 

ఐరోపా దేశాల్లోకి నిషేధిత వస్తువులు 

లిథువేనియా ఈ బెలూన్లు రన్‌వేలపైకి వచ్చే విధంగా ప్రత్యేక ప్రణాళిక ప్రకారం ప్రయోగిస్తున్నాయని, ఇది తమ ఆర్థిక వ్యవస్థ,వైమానిక భద్రతను లక్ష్యంగా పెట్టిన హైబ్రిడ్ దాడి అని మండిపడింది. బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో, ఇవి కేవలం వెదర్ బెలూన్లే అని, ఆరోపణలు నిజమైతే క్షమాపణలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. అయితే, కొన్ని కథనాలు, ఐరోపా దేశాల్లోకి నిషేధిత వస్తువులను తీసుకెళ్లడానికి వీటిని వినియోగిస్తారని పేర్కొన్నాయి. లిథువేనియానే తమ గగనతలంలో డ్రోన్లు ప్రయోగించి గూఢచర్యానికి పాల్పడుతోందని లుకషెంకో ప్రభుత్వం ఆరోపణలు చేస్తోంది. బెలూన్లు లేదా డ్రోన్ల ద్వారా ఉగ్రవాదులకు అవసరమైన సామగ్రిని పంపుతున్నట్లు కూడా వ్యాఖ్యానించింది. ఆ దేశ దౌత్యవేత్తలకు సమన్లు కూడా ఇచ్చినట్లు చెప్పారు.

వివరాలు 

నాటో దేశాల గగనతలలో భారీ డ్రోన్ల ప్రవేశం

వీటివల్ల తమ దేశ కార్యకలాపాలు అంతరాయం చెందుతున్నందున, అక్టోబర్‌లో లిథువేనియా బెలారస్ సరిహద్దులను మూసివేసింది. దీనికి ప్రతిగా, బెలారస్ వెయ్యికి పైగా లిథువేనియా కార్గో ట్రక్కులను దేశం నుంచి బయటకు వెళ్లకుండా నిరోధించింది. అయితే, లాజిస్టిక్స్ కంపెనీల ఒత్తిడి కారణంగా లిథువేనియా చివరికి సరిహద్దులు తిరిగి తెరవాల్సి వచ్చింది. బెలారస్ రష్యా మిత్రదేశం. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మూడేళ్లుగా కొనసాగుతోంది. సెప్టెంబర్‌లో, నాటో దేశాల గగనతలలో భారీ డ్రోన్లు ప్రవేశించాయి. వీటిని రష్యా ప్రయోగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ పరిణామాలతో, ఐరోపా ఖండం ఇప్పటికే హై అలర్ట్‌లో ఉన్నపుడు, బెలారస్-లిథువేనియా మధ్య ఉద్రిక్తతలు ఆందోళన కలిగిస్తున్నాయి.

Advertisement