Biden: అమెరికాకు చీకటి రోజులివి.. ట్రంప్ పాలనపై బైడెన్ తీవ్ర విమర్శలు
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా ప్రస్తుతం కష్టకాలాన్ని ఎదుర్కొంటోందని, కానీ ప్రజలు నమ్మకం కోల్పోకూడదని మాజీ అధ్యక్షుడు జో బైడెన్ పేర్కొన్నారు. బోస్టన్‌లోని ఎడ్వర్డ్ ఎం. కెన్నెడీ ఇన్‌స్టిట్యూట్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆదివారం ఆయనకు "జీవన సాఫల్య పురస్కారం" ప్రదానం చేశారు. ఆ కార్యక్రమంలో మాట్లాడిన బైడెన్ (82) మాట్లాడుతూ, "అమెరికా ఈ సమయంలో చీకటి రోజులను అనుభవిస్తున్నా, త్వరలోనే దేశం తిరిగి సరైన దారిలోకి వస్తుంది. ఎప్పటిలాగే మరింత బలంగా ఎదుగుతుంది. మనం మన విశ్వాసాన్ని కోల్పోవద్దు" అని తెలిపారు.
వివరాలు
తొలిసారిగా ప్రజల ముందుకు బైడెన్
ప్రస్తుతం ప్రభుత్వ విధానాలకు, ముఖ్యంగా ట్రంప్ నాయకత్వంలోని పాలనకు వ్యతిరేకంగా స్వరం వినిపిస్తున్న వారిని ఆయన అభినందించారు. దేశంలో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛపై దాడులు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే, అధ్యక్షుడు ట్రంప్ తన కార్యనిర్వాహక అధికారాలను అధిగమిస్తున్నారని విమర్శించారు. ఇటీవల ప్రొస్టేట్ క్యాన్సర్ కారణంగా రేడియేషన్ చికిత్స పొందిన అనంతరం బైడెన్ తొలిసారిగా ప్రజల ముందుకు వచ్చి ప్రసంగించారు.