T20 WC IND vs SA: టీమిండియాకు భారీ షాక్.. సూపర్-8కు ముందు కీలక పేసర్‌కు గాయం!
ఈ వార్తాకథనం ఏంటి
సొంతగడ్డపై జరుగుతున్న టీ20 ప్రపంచకప్-2026లో టీమిండియా దూసుకుపోతోంది. లీగ్ దశలో గ్రూప్-ఎ నుంచి అజేయంగా నిలిచిన సూర్యకుమార్ సేన సూపర్-8కు టాపర్‌గా అర్హత సాధించింది. వరుసగా అమెరికా, నమీబియా, పాకిస్తాన్, నెదర్లాండ్స్‌లపై విజయాలు నమోదు చేసి ఆత్మవిశ్వాసంతో తదుపరి దశలోకి అడుగుపెట్టింది.
Details
దక్షిణాఫ్రికాతో తొలిపోరు
ఇప్పుడే అసలు సమరం ప్రారంభమవుతోంది. గ్రూప్-1లో ఉన్న భారత్ సూపర్-8లో తొలి మ్యాచ్‌ను దక్షిణాఫ్రికాతో ఆడనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఆదివారం రాత్రి 7 గంటలకు ఈ పోరు ప్రారంభంకానుంది. ప్రాక్టీస్‌లో ఎదురుదెబ్బ మ్యాచ్‌కు ముందు అహ్మదాబాద్‌కు చేరుకున్న భారత జట్టు నెట్ సెషన్లలో ముమ్మరంగా సాధన చేస్తోంది. అయితే ఈ సమయంలో టీమిండియాకు షాక్ తగిలినట్లు సమాచారం. ఆల్‌రౌండర్ హర్దిక్ పాండ్యా బాదిన బంతి భారత స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ ఎడమ మోకాలికి బలంగా తగిలినట్లు తెలుస్తోంది. బంతి తాకిన వెంటనే నొప్పితో విలవిల్లాడిన సిరాజ్ మధ్యలోనే నెట్ సెషన్‌ను వదిలి వెళ్లాడు. దీనికి సంబంధించిన దృశ్యాలను 'రెవ్‌స్పోర్ట్స్' సోషల్ మీడియాలో పంచుకుంది.
Details
గాయాల బెడద కొనసాగుతూనే…
ఈ టోర్నీ ప్రారంభానికి ముందే టీమిండియాను గాయాలు వెంటాడుతున్నాయి. యువ పేసర్ హర్షిత్ రానా గాయంతో టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. అతడి స్థానంలో ప్రపంచకప్ జట్టులోకి వచ్చిన సిరాజ్ గ్రూప్ దశలో అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో అవకాశం దక్కించుకున్నాడు. ప్రధాన పేసర్ జస్పిత్ బుమ్రా జ్వరంతో తుదిజట్టుకు దూరమవడంతో సిరాజ్‌కు ఛాన్స్ లభించింది. ఆ మ్యాచ్‌లో ఈ హైదరాబాదీ పేసర్ మూడు వికెట్లు తీసి మెప్పించాడు. అయితే తదుపరి మ్యాచ్‌లకు బుమ్రా అందుబాటులోకి రావడంతో సిరాజ్ మళ్లీ బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఇక ఓపెనర్ అభిషేక్ శర్మ కడుపు నొప్పి కారణంగా నమీబియాతో మ్యాచ్‌కు దూరమయ్యాడు. మరో ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయం నుంచి కోలుకుని ఫిట్‌నెస్ సాధించినప్పటికీ ఇప్పటివరకు తుదిజట్టులో స్థానం దక్కించుకోలేదు.
Details
కీలక దశకు ముందు ఆందోళన
ఇప్పటికే కీలక సూపర్-8 దశలోకి అడుగుపెట్టిన టీమిండియా.. సౌతాఫ్రికా, జింబాబ్వే, వెస్టిండీస్‌లను ఎదుర్కోనుంది. సెమీ ఫైనల్ అవకాశాలను నిలబెట్టుకోవాలంటే ఈ దశలో సత్తా చాటాల్సిందే. అయితే పటిష్ట దక్షిణాఫ్రికాతో పోరుకు ముందు సిరాజ్ గాయం అంశం జట్టు వ్యూహాలపై ప్రభావం చూపే అవకాశముంది.