Bill Clinton: అస్వస్థతకు గురైన అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్..
అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ ఆరోగ్యం సోమవారం (స్థానిక కాలమానం ప్రకారం) క్షీణించింది. జ్వరం వంటి పలు ఆరోగ్య సమస్యలతో వాషింగ్టన్‌లోని ఆసుపత్రిలో ఆయన చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఏంజెల్ యురేనా తెలిపారు. డెమొక్రాటిక్ నేత బిల్ క్లింటన్ మెడ్‌స్టార్ జార్జ్‌టౌన్ విశ్వవిద్యాలయ ఆసుపత్రిలో పలు వైద్య పరీక్షల కోసం చేరారు. గత కొద్దిరోజులుగా ఆయన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.
2004లో బైపాస్ సర్జరీ
ఛాతి నొప్పి, శ్వాస సమస్యల కారణంగా 2004లో బైపాస్ సర్జరీ చేయించుకున్నారు. 2010లో కరోనరీ ఆర్టరీ స్టెంట్‌లను అమర్చుకున్నారు. 2021లో యూరినరీ ఇన్ఫెక్షన్‌తో పోరాడారు. గత అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో బిల్ క్లింటన్ చాలా యాక్టివ్‌గా ఉండి, డెమొక్రాటిక్ అభ్యర్థి కమలా హారిస్ తరఫున ప్రచారం చేశారు. డెమోక్రటిక్ నేషనల్ కన్వెన్షన్‌లో ప్రసంగిస్తూ, కమలా హారిస్, జో బైడెన్‌పై ప్రశంసలు కురిపించారు. ట్రంప్‌పై విమర్శలు చేయడంలో కూడా వెనుకాడలేదు. 1993 నుంచి 2001 వరకు అమెరికా అధ్యక్షుడిగా పనిచేశారు.