Birmingham Bankrupt: దివాలా తీసిన బ్రిటన్‌లోని రెండో అతిపెద్ద నగరం
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచంలోని బలమైన ఆర్థివ్యవస్థల్లో బ్రిటన్ ఒకటి. అయితే ఇప్పుడు ఆ దేశం ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతోంది.
ఈ క్రమంలో బ్రిటన్‌లోని రెండో అతిపెద్ద నగరం బర్మింగ్‌హామ్ దివాళా తీసిందని సిటీ కౌన్సిల్ ప్రకటించింది.
బర్మింగ్‌హామ్‌లో 956 మిలియన్ డాలర్ల వరకు సమాన వేతన క్లెయిమ్‌లు చేరుకున్న నేపథ్యంలో సిటీ కౌన్సిల్ దివాలా నోటీసులు జారీ చేసింది.
10లక్షల మందికి పైగా సేవలను అందించే బర్మింగ్‌హామ్ సిటీ కౌన్సిల్ మంగళవారం సెక్షన్ 114 నోటీసును దాఖలు చేసింది. అన్నిరకాల అనవసరమైన ఖర్చులను నిలిపివేసినట్లు వెల్లడించింది.
సమాన వేతన క్లెయిమ్‌లు 650 మిలియన్ పౌండ్ల నుంచి 760 మిలియన్ పౌండ్ల మధ్య చెల్లించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తలెత్తి, లోటు ఏర్పడినట్లు సిటీ కౌన్సిల్ వివరించింది.
బ్రిటన్
2023-24లో లోటు 87 మిలియన్ పౌండ్లు అని అంచనా
బర్మింగ్‌హామ్ నగరం 2023-24 ఆర్థిక సంవత్సరానికి 87 మిలియన్ పౌండ్ల లోటును కలిగి ఉంటుందని సిటీ కౌన్సిల్ అంచనా వేస్తోంది.
బర్మింగ్‌హామ్ కౌన్సిల్ డిప్యూటీ లీడర్ షారన్ థాంప్సన్ దివాలాపై స్పందించారు. యూకే కౌన్సిల్ చారిత్రాత్మక సమాన వేతన బాధ్యత ఆందోళనలను చాలా కాలంగా ఎదుర్కొంటోందన్నారు.
ఈ పరిస్థితికి యూకేలో అధికారంలో ఉన్న కన్జర్వేటివ్ పార్టీనే కారణం అని నిందించారు. వరుసగా వచ్చిన కన్జర్వేటివ్ ప్రభుత్వాలు బర్మింగ్‌హామ్ నుంచి దాదాపు 1.25 బిలియన్ డాలర్ల నిధులను లాకున్నాయని విమర్శించారు.
దివాలాపై ప్రధాన మంత్రి రిషి సునక్ ప్రతినిధి మాట్లాడుతూ.. బర్మింగ్‌హామ్‌లో పరిస్థితి తమకు తెలుసునని స్పష్టం చేశారు.
కౌన్సిల్‌లు తమ సొంత బడ్జెట్‌లను సరిగా వినియోగించుకోవాలన్నారు. తప్పుకుండా ప్రభుత్వం ఆదుకుంటుందని వెల్లడించారు.