Pakistani military personnel: బలూచిస్థాన్‌లో పాక్ సైనిక కాన్వాయ్‌పై భారీ దాడి.. 25 మంది మృతి?
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్ ఆర్మీకి మరో ఎదురుదెబ్బ తగిలినట్లు బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) ప్రకటించింది. బలూచిస్థాన్‌లోని జియారత్ క్రాస్ వద్ద పాకిస్థాన్ ఆర్మీ సైనిక కాన్వాయ్‌ను లక్ష్యంగా చేసుకుని భారీ దాడి చేసినట్లు తెలిపింది. ఈ ఘటనలో 25 మంది పాకిస్థాన్ సైనికులు మరణించారని, రెండు సైనిక వాహనాలను ధ్వంసం చేసినట్లు పేర్కొంది. అయితే ఈ వాదనలను ధ్రువీకరిస్తూ పాకిస్థాన్ ప్రభుత్వం లేదా ఆర్మీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. బీఎల్‌ఏ ప్రకారం.. జియారత్ క్రాస్ వద్ద పాకిస్థాన్ ఆర్మీకి చెందిన కాన్వాయ్‌పై తమ దళాలు దాడి చేశాయి. కాన్వాయ్‌లోని రెండు వాహనాలను లక్ష్యంగా చేసుకున్నామని, వాటిలో ఒకటి ఆర్మీ ట్రక్ అని వెల్లడించింది.
వివరాలు
జియారత్ క్రాస్ వద్ద దాడి
తొలుత ఈ దాడిలో 18 మంది సైనికులు మరణించినట్లు ప్రకటించిన బీఎల్‌ఏ.. అనంతరం ఆ సంఖ్యను 25కు సవరించింది.
దాడికి సంబంధించిన దృశ్యాలుగా పేర్కొంటూ తమ అధికారిక మీడియా ఛానల్ 'హక్కల్'లో ఓ వీడియోను విడుదల చేసినట్లు బీఎల్‌ఏ తెలిపింది.
జియారత్ క్రాస్ వద్ద జరిగిన దాడికి సంబంధించిన దృశ్యాలు అందులో ఉన్నాయని పేర్కొంది.
అయితే ఇది పూర్తి వీడియో కాదని, దాడికి సంబంధించిన పూర్తి దృశ్యాలను తరువాత విడుదల చేస్తామని వెల్లడించింది.
వివరాలు
మరో ఘటనలోనూ దాడి..
ఇదే సమయంలో సురాబ్‌లోని హజికా ప్రాంతంలో పాకిస్థాన్ ఆర్మీ వాహనంపై మరో దాడి చేసినట్లు బీఎల్‌ఏ ప్రకటించింది.
తమ 'స్పెషల్ టాక్టికల్ ఆపరేషన్స్ స్క్వాడ్' (STOS) పేలుడు పదార్థాలతో నింపిన వాహనాన్ని రిమోట్ ద్వారా పేల్చినట్లు తెలిపింది.
ఈ దాడిలో పాకిస్థాన్ ఆర్మీకి చెందిన ఓ వాహనం పూర్తిగా ధ్వంసమైందని, ఏడుగురు సైనికులు మరణించారని పేర్కొంది.
అయితే జియారత్ క్రాస్, హజికా ప్రాంతాల్లో జరిగినట్లు బీఎల్‌ఏ పేర్కొన్న ఈ రెండు ఘటనలపై పాకిస్థాన్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ధ్రువీకరణ వెలువడలేదు.
దీంతో సైనికుల మరణాలు, వాహనాల ధ్వంసంపై బీఎల్‌ఏ చేసిన వాదనలను స్వతంత్రంగా నిర్ధారించాల్సి ఉంది.