Myanmar: మయన్మార్‌లో భారీ పేలుడు.. 55 మంది మృతి, 74 మందికి పైగా గాయాలు
ఈ వార్తాకథనం ఏంటి
అంతర్యుద్ధ పరిస్థితులతో అల్లకల్లోలంగా ఉన్న మయన్మార్‌లో భారీ విషాదం చోటుచేసుకుంది. తిరుగుబాటుదారుల ఆధీనంలోని షాన్ రాష్ట్రంలో ఆదివారం మధ్యాహ్నం సంభవించిన భారీ పేలుడు కారణంగా 55 మంది ప్రాణాలు కోల్పోగా, 74 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. గనుల తవ్వకాల కోసం నిల్వ ఉంచిన పేలుడు పదార్థాల డిపో ఒక్కసారిగా పేలిపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు వెల్లడైంది. చైనా సరిహద్దుకు అత్యంత సమీపంలో ఉన్న నమ్‌ఖామ్ టౌన్‌షిప్ పరిధిలోని కౌంగ్ టాట్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. స్థానిక మీడియా నివేదికలు, బీబీసీ కథనాల ప్రకారం మృతుల్లో 30 మంది పురుషులు, 25 మంది మహిళలు ఉన్నారు. పేలుడు తీవ్రత ఎంత ఎక్కువగా ఉందంటే, సమీపంలోని దాదాపు 100 ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి.
వివరాలు
ప్రమాదవశాత్తూ జరిగిన పేలుడే..
మయన్మార్‌లో సైనిక పాలకులు మరియు తిరుగుబాటు గ్రూపుల మధ్య కొనసాగుతున్న ఘర్షణల నేపథ్యంలో మొదట ఈ ఘటనను స్థానికులు వైమానిక దాడిగా భావించారు. పేలుడు అనంతరం ఆకాశమంతా దట్టమైన నల్లటి పొగలు వ్యాపించడంతో ప్రజలు భయాందోళనలకు గురై ప్రాణాలు దక్కించుకునేందుకు పరుగులు తీశారు. అయితే, తర్వాత ఇది ప్రమాదవశాత్తూ జరిగిన పేలుడేనని స్పష్టమైంది. ఈ ప్రాంతాన్ని నియంత్రిస్తున్న తాంగ్ నేషనల్ లిబరేషన్ ఆర్మీ (TNLA) ఘటనపై స్పందించింది.
వివరాలు
సహాయక చర్యలు ప్రారంభించిన స్థానిక స్వచ్ఛంద సంస్థలు
గనులు,క్వారీల కార్యకలాపాల కోసం తమ ఆర్థిక విభాగం నిల్వ ఉంచిన జెలిగ్నైట్ సహా ఇతర పేలుడు పదార్థాలు అస్థిర పరిస్థితుల కారణంగా పేలిపోయినట్లు తెలిపింది. బాధితులకు అవసరమైన సహాయం అందించడంతో పాటు ఘటనపై సమగ్ర విచారణ నిర్వహిస్తామని ప్రకటించింది. ఇప్పటికే స్థానిక స్వచ్ఛంద సంస్థలు సహాయక చర్యలు ప్రారంభించగా,గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.