LOADING...
'BLESSED ARE THE PEACEMAKERS': మధ్యప్రాచ్య శాంతి ప్రక్రియలో మరో ముందడుగు.. అబ్రహామ్ ఒప్పందాల విస్తరణపై అమెరికా కొత్త చర్యలు
అబ్రహామ్ ఒప్పందాల విస్తరణపై అమెరికా కొత్త చర్యలు

'BLESSED ARE THE PEACEMAKERS': మధ్యప్రాచ్య శాంతి ప్రక్రియలో మరో ముందడుగు.. అబ్రహామ్ ఒప్పందాల విస్తరణపై అమెరికా కొత్త చర్యలు

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 07, 2025
03:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

"శాంతిని నెలకొల్పేవారు ధన్యులు" అనే సందేశంతో,అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం (నవంబర్ 7) కీలక ప్రకటన చేశారు. కజాఖ్‌స్తాన్ కూడా అబ్రహామ్ ఒప్పందాల్లో చేరడానికి ఓకే చెప్పిందని. దీంతో ఇజ్రాయెల్‌తో ఆ దేశం సంబంధాలు సాధారణంగా కొనసాగుతాయని ట్రంప్ చెప్పారు. ట్రంప్ తన సోషల్ ప్లాట్‌ఫారమ్ 'ట్రూత్ సోషల్'లో చేసిన పోస్టులో, తనకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహు, కజాఖ్‌స్తాన్ అధ్యక్షుడు కాసిమ్-జొమార్ట్ టొకాయేవ్‌లతో ఫోన్ సంభాషణ జరిగినట్లు చెప్పారు. అదే సమయంలో, త్వరలో మరికొన్ని దేశాలు కూడా అబ్రహమ్ ఒప్పందాల్లో చేరే అవకాశాలు ఉన్నాయని సూచించారు. అయితే, రాయిటర్స్ నివేదిక ప్రకారం, కజాఖ్‌స్తాన్‌కి ఇజ్రాయెల్‌తో దౌత్య, ఆర్థిక సంబంధాలు ఇప్పటికే ఉన్నందున, ఈ చర్య ప్రతీకాత్మకంగా భావిస్తున్నారు.

వివరాలు 

అబ్రహామ్ అకార్డ్స్‌ను మరిన్ని దేశాలకు విస్తరించాలనే ప్రయత్నాలు

"ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, కజాఖ్‌స్తాన్ అధ్యక్షుడు టొకాయేవ్‌ల మధ్య అద్భుతమైన కాల్‌ను నేను ఏర్పాటు చేశాను. ఇది నా రెండో పదవీకాలంలో అబ్రహామ్ అకార్డ్స్‌లో చేరిన మొదటి దేశం. ఇది ప్రపంచంలో శాంతికి వంతెనలు కట్టే దిశగా పెద్ద అడుగు" అని రాసుకొచ్చారు. త్వరలో ఈ ఒప్పందాన్ని అధికారికంగా ప్రకటించేందుకు సంతక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు ట్రంప్ తెలిపారు. ఇదే సమయంలో,అబ్రహామ్ అకార్డ్స్‌ను మరిన్ని దేశాలకు విస్తరించాలనే ప్రయత్నాలు అమెరికా గత కొంతకాలంగా కొనసాగిస్తోంది. ఈ విషయంలో అమెరికా ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్ ఇప్పటికే గత జూలై నెలలోనే సంకేతాలు ఇచ్చారు. ఆయన పలుమార్లు, ఇంకా కొత్త దేశాలు కూడా అబ్రహామ్ అకార్డ్స్‌లో చేరడానికి ఆసక్తి చూపిస్తున్నాయి అని పేర్కొన్నారు.

వివరాలు 

 ఈ ఒప్పందాల్లోకి సౌదీ అరేబియా

ఫ్లోరిడాలో జరిగిన ఒక వ్యాపార కార్యక్రమంలో కూడా, ఒక దేశం త్వరలో చేరబోతోందని పేర్కొన్నారు. మరోవైపు, అజర్‌బైజాన్, ఉజ్బెకిస్తాన్ కూడా ఇజ్రాయెల్‌తో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నందున, అవి కూడా అబ్రహమ్ అకార్డ్స్‌లో చేరే అవకాశాలుగా భావిస్తున్నారు. అదేవిధంగా, అమెరికా ప్రధానంగా సౌదీ అరేబియాని ఈ ఒప్పందాల్లోకి తీసుకురావాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ నవంబర్ 18న అమెరికా పర్యటనపై అందరి దృష్టి నిలిచింది.

వివరాలు 

అబ్రహామ్ అకార్డ్స్ అంటే ఏమిటి?

ట్రంప్ తొలి పాలనా కాలంలో ప్రకటించిన ఈ ఒప్పందం ద్వారా, అమెరికా మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్,అరబ్ దేశాల మధ్య దౌత్య సంబంధాలు నెలకొల్పడమే లక్ష్యం. 2020లో బహ్రెయిన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, 1996లో జోర్డాన్ తర్వాత, ఇజ్రాయెల్‌ను గుర్తించిన తొలి అరబ్ దేశాలుగా నిలిచాయి. తర్వాత సూడాన్, మొరాకో కూడా ఈ ఒప్పందంలో చేరాయి. ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్ ఈ ఒప్పందానికి ప్రధాన ఆర్కిటెక్ట్‌గా పనిచేశారు. అమెరికా ప్రకారం, ఈ ఒప్పందాల ఉద్దేశ్యం: వేర్వేరు మతాలు, సంస్కృతుల మధ్య అవగాహన పెంచడం తీవ్రవాదం, ఘర్షణలను తగ్గించడం మధ్యప్రాచ్యంలో శాంతి, భద్రత, అభివృద్ధి తీసుకురావడం ఇజ్రాయెల్‌, పొరుగు దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు బలోపేతం చేయడం