Bangladesh: బంగ్లాదేశ్ ఎన్నికల్లో బీఎన్‌పీ ఘన విజయం.. తదుపరి ప్రధాని తారిక్ రెహమాన్
ఈ వార్తాకథనం ఏంటి
బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ (బీఎన్‌పీ) ఘన విజయం సాధించింది. మొత్తం 299 స్థానాలకు గాను 209 స్థానాల్లో గెలుపొందుతూ స్పష్టమైన మెజారిటీని సొంతం చేసుకుంది. పార్టీ అధినేత తారిక్ రెహమాన్ పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లోనూ భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఈ ఫలితాలతో బంగ్లాదేశ్ తదుపరి ప్రధానిగా తారిక్ రెహమాన్ బాధ్యతలు చేపట్టనున్నారు. గురువారం జరిగిన ఎన్నికల్లో పోలింగ్ ముగిసిన తర్వాత సాయంత్రం 4:30 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మొదటి నుంచే తారిక్ రెహమాన్ నేతృత్వంలోని బీఎన్‌పీ ఆధిక్యంలో కొనసాగింది. జమాత్-ఏ-ఇస్లామీ పార్టీ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. బంగ్లాదేశ్‌లో మొత్తం 300 పార్లమెంట్ స్థానాలు ఉండగా, ఒక నియోజకవర్గంలో అభ్యర్థి మరణంతో అక్కడ పోలింగ్ నిలిచిపోయింది.
వివరాలు
బీఎన్‌పీ ఛైర్‌పర్సన్ ఖలీదా జియా మృతి
దీంతో 299 స్థానాలకు మాత్రమే ఎన్నికలు జరగగా, తాజా ఫలితాల్లో బీఎన్‌పీ 208 స్థానాలను దక్కించుకుంది. బీఎన్‌పీ ఛైర్‌పర్సన్ ఖలీదా జియా కుమారుడైన తారిక్ రెహమాన్, ఆమె ఇటీవల మృతి చెందడంతో పార్టీ బాధ్యతలను పూర్తిగా భుజాన వేసుకున్నారు. సుమారు 17 ఏళ్ల తర్వాత లండన్ నుంచి స్వదేశానికి వచ్చిన ఆయన, తక్కువ సమయంలోనే ఉత్సాహభరితంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థిరమైన పాలన కావాలనే ప్రజల ఆకాంక్ష ఈ ఫలితాల్లో స్పష్టంగా కనిపించింది.
వివరాలు
2024 ఆగస్టులో దేశవ్యాప్తంగా భారీ ఉద్యమం
2024 ఆగస్టులో విద్యార్థుల నాయకత్వంలో దేశవ్యాప్తంగా భారీ ఉద్యమం చోటు చేసుకుంది. ఈ ఉద్యమంలో వందలాది మంది ప్రాణాలు కోల్పోగా, ఆ పరిణామాల నేపథ్యంలో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయింది. అనంతరం యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. ఇప్పుడు ఎన్నికల ద్వారా స్థిరమైన ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో, అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే తమ ప్రధాన లక్ష్యమని తారిక్ రెహమాన్ ఎన్నికల ప్రచారంలో వెల్లడించారు.