బ్రెజిల్‌లో విధ్వంసం: అధ్యక్ష భవనం తలుపు బద్ధలుకొట్టి బోల్సొనారో మద్దతుదారులు బీభత్సం
బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సొనారో మద్దతుదారులు విధ్వంసం సృష్టించారు. అమెరికాను మించి.. నిరసనకారులు బీభత్సం చేశారు. అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా గద్దె దిగిపోవాలని డిమాండ్ చేస్తూ.. అధ్యక్ష భవనం, పార్లమెంట్, సుప్రీంకోర్టులోకి దూసుకెళ్లారు. గత సంవత్సరం జరిగిన ఎన్నికల్లో బోల్సోనారో ఓడించిన లూయిజ్ ఇనాసియో లులా అధ్యక్షుడయ్యారు. ఎన్నికలు సరిగా జరగలేదని బోల్సొనారో మద్దతుదారులు నిరసనకు దిగారు. ఈ క్రమంలో ఒక్కసారిగా పార్లమెంట్, సుప్రీంకోర్టులోకి దాదాపు 3000 మంది దూసుకొచ్చారు. ఆ సమయంలో నిరసనకారులు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో వారిని అదుపు చేయడం భద్రతా సిబ్బందికి కష్టతరమైంది. దీంతో నిరసనకారులు తలుపులు బద్దలు కొట్టుకొని లోపలికి ప్రవేశించారు. అయితే నిరసనకారులను అదుపులోకి తేవడానికి భద్రతా సిబ్బంది టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు.
'ఇది ఫాసిస్టుల దాడి'
పార్లమెంట్, అధ్యక్ష భవనం, సుప్రీంకోర్టుపై దాడిని ప్రెసిడెంట్ లూలా తీవ్రంగా స్పందించారు. ఇలాంటి ఘటన దేశ చరిత్రలో ఎన్నడూ జరగలేదన్నారు. దాడి చేసిన వారిని ఫాసిస్టులుగా అభివర్ణించారు. ప్రస్తుతం సావోపాలో రాష్ట్రంలో అధికారిక పర్యటనలో ఉన్న లూలా.. దాడి చేసిన వారు కచ్చితంగా శిక్షించబడతారని చెప్పారు. దాడి చేసిన వారిలో ఇప్పటికే 300 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. చివరి సభ్యుడిని గుర్తించే వరకు విచారణ కొనసాగుతుందని తెలిపారు. ఈ దాడితో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సొనారో. లూలా ఆరోపణలు అన్ని నిరాధారమైనవని పేర్కొన్నారు. నిరసనకారులు శాంతియుతంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. ఈ దాడిని అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఖండించారు. ఇది ప్రజాస్వామ్యంపై దాడిగా అభివర్ణించారు.