Loading...
Shakib Al Hasan: హసీనా ప్రెస్‌మీట్‌ తర్వాత షకీబ్‌ ఇంటిపై దాడి.. బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తత
హసీనా ప్రెస్‌మీట్‌ తర్వాత షకీబ్‌ ఇంటిపై దాడి.. బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తత

Shakib Al Hasan: హసీనా ప్రెస్‌మీట్‌ తర్వాత షకీబ్‌ ఇంటిపై దాడి.. బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తత

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 06, 2026
09:25 am

ఈ వార్తాకథనం ఏంటి

బంగ్లాదేశ్‌లో రాజకీయ ఉద్రిక్తతలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. మాజీ ప్రధాని షేక్‌ హసీనా ఢిల్లీ నుంచి వర్చువల్‌గా నిర్వహించిన మీడియా సమావేశం అనంతరం చోటుచేసుకున్న పరిణామాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. సమావేశం జరిగిన కొద్ది గంటల్లోనే బంగ్లాదేశ్‌ స్టార్‌ క్రికెటర్‌,మాజీ ఎంపీ షకీబ్‌ అల్‌ హసన్‌ కుటుంబానికి చెందిన పూర్వీకుల ఇంటిపై దాడి జరగడం తీవ్ర కలకలం రేపింది. మగురా పట్టణంలోని కేశబ్‌మోర్‌ ప్రాంతంలో ఉన్న షకీబ్‌ కుటుంబ ఇంటిపై బుధవారం రాత్రి సుమారు 8.45 గంటల సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లు రువ్వారు. అనంతరం ఇంటికి నిప్పు పెట్టేందుకు కూడా ప్రయత్నించినట్లు పోలీసులు వెల్లడించారు. దాడిలో ఇంటి కిటికీలు ధ్వంసమైనట్లు మగురా సదర్‌ పోలీస్‌ స్టేషన్‌ అధికారి అబ్దుల్లా అల్‌ మమూన్‌ తెలిపారు.

వివరాలు 

నయా ఫాసిజం వైపు బంగ్లాదేశ్

స్థానికుల కథనం ప్రకారం కొందరు పెట్రోల్‌ బాంబులు కూడా విసిరినట్లు ప్రచారం జరిగినప్పటికీ, దీనిని పోలీసులు ఇప్పటివరకు అధికారికంగా ధృవీకరించలేదు.

ఈ ఘటనకు షకీబ్‌ రాజకీయ అనుబంధమే కారణమని మాజీ ప్రధాని షేక్‌ హసీనా నేతృత్వంలోని ఆవామీ లీగ్‌ ఆరోపించింది.

ఢిల్లీలోని ఫారిన్‌ కరస్పాండెంట్స్‌ క్లబ్‌లో నిర్వహించిన వర్చువల్‌ మీడియా సమావేశంలో హసీనా ప్రసంగించగా, షకీబ్‌ అల్‌ హసన్‌ కూడా పాల్గొన్నారు.

ఆ సమావేశంలో పాల్గొన్న కొద్ది గంటల్లోనే ఆయన కుటుంబ ఇంటిపై దాడి జరిగిందని పార్టీ పేర్కొంది.

ఆవామీ లీగ్‌ విడుదల చేసిన ప్రకటనలో, పార్టీ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌కు హాజరైన వారి ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయని, బంగ్లాదేశ్‌ నయా ఫాసిజం వైపు సాగుతోందని ఆరోపించింది.

వివరాలు 

షకీబ్‌ అలా..

అయితే షకీబ్‌ ఇంటిపై జరిగిన దాడికి, హసీనా మీడియా సమావేశానికి నేరుగా సంబంధం ఉందని ఇప్పటివరకు అధికారులు నిర్ధారించలేదు.

దాడికి పాల్పడిన వ్యక్తులు ఎవరు, వారి ఉద్దేశం ఏమిటి అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

బంగ్లాదేశ్‌ క్రికెట్‌ చరిత్రలో అత్యుత్తమ ఆల్‌రౌండర్లలో ఒకరిగా గుర్తింపు పొందిన షకీబ్‌ అల్‌ హసన్‌ రాజకీయాల్లోనూ తన ముద్ర వేశారు.

2024 సాధారణ ఎన్నికల్లో ఆవామీ లీగ్‌ అభ్యర్థిగా మగురా-1 నియోజకవర్గం నుంచి ఎంపీగా విజయం సాధించారు.

అయితే షేక్‌ హసీనా ప్రభుత్వం పతనం అనంతరం ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి.

ఒక హత్య కేసులో కూడా ఆయన పేరు నిందితుల జాబితాలో చేరింది

ADVERTISEMENT

వివరాలు 

సంచలనంగా షేక్‌ హసీనా వ్యాఖ్యలు

గతంలో తనపై నమోదైన కేసులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని, అయితే భద్రత కల్పించాలని కోరిన షకీబ్‌ ప్రస్తుతం కుటుంబంతో కలిసి అమెరికాలో నివసిస్తున్నారు.

అదే సమయంలో వివిధ ఫ్రాంచైజీ క్రికెట్‌ టోర్నీల్లో మాత్రం కొనసాగుతున్నారు.

మరోవైపు, ఢిల్లీ నుంచి నిర్వహించిన వర్చువల్‌ సమావేశంలో షేక్‌ హసీనా చేసిన వ్యాఖ్యలు కూడా సంచలనంగా మారాయి.

ఈ ఏడాది డిసెంబర్‌లో తాను బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్లనున్నట్లు ఆమె ప్రకటించారు.

తన తిరుగు ప్రయాణం అధికారాన్ని తిరిగి దక్కించుకోవడం కోసం కాదని, దేశాన్ని మళ్లీ అభివృద్ధి, లౌకికవాదం, పురోగతి మార్గంలో నడిపించడానికేనని చెప్పారు.

స్వదేశానికి తిరిగి వెళ్తే అరెస్టు చేసే అవకాశం ఉందని, ప్రాణహాని కూడా ఎదురవొచ్చని తెలిసినా దేశానికి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు.

ADVERTISEMENT

వివరాలు 

హసీనా వర్చువల్‌ సమావేశంపై బంగ్లాదేశ్‌లోని ప్రతిపక్ష పార్టీలు తీవ్ర అభ్యంతరం

2024 ఆగస్టు 5న ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనల నేపథ్యంలో పదవి కోల్పోయిన షేక్‌ హసీనా అనంతరం భారత్‌కు వచ్చారు.

అప్పటి నుంచి ఆమె భారత్‌లోనే నివసిస్తున్నారు. ఇదే సమయంలో బంగ్లాదేశ్‌లోని ప్రత్యేక ట్రైబ్యునల్‌ ఆమెపై మానవత్వానికి వ్యతిరేక నేరాల ఆరోపణల కేసులో గైర్హాజరులోనే మరణశిక్ష విధించింది.

హసీనా వర్చువల్‌ సమావేశంపై బంగ్లాదేశ్‌లోని ప్రతిపక్ష పార్టీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి.

ఆమె ప్రసంగాన్ని ప్రసారం చేయవద్దని కొన్ని మీడియా సంస్థలకు హెచ్చరికలు వెళ్లినట్లు సమాచారం.

వివరాలు 

ప్రజాస్వామ్య వ్యవస్థకు ముప్పు ఏర్పడుతోంది: హసీనా అనుచరులు 

మరోవైపు హసీనా అనుచరులు మాత్రం దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థకు ముప్పు ఏర్పడుతోందని ఆరోపిస్తున్నారు.

ఈ రాజకీయ ఉద్రిక్తతల మధ్య షకీబ్‌ కుటుంబ ఇంటిపై జరిగిన దాడి దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది.

ప్రస్తుతం ఆ ఇంటి వద్ద పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేయడంతో పాటు దాడికి పాల్పడిన వ్యక్తుల కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

హసీనా వర్చువల్‌ సమావేశం అనంతరం షకీబ్‌ ఇంటిపై దాడి

ADVERTISEMENT