Pakistan Bomb Blast: పాకిస్తాన్‌లో బాంబు పేలుడు.. ఆరుగురు పోలీసులు మృతి
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్ లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో తీవ్ర బాంబు పేలుడు చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు పోలీసు అధికారులు ప్రాణాలు కోల్పోయారు. ఆఫ్ఘన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న ట్యాంక్ జిల్లాలో ఈ పేలుడు సంభవించినట్లు అధికారులు తెలిపారు. మృతుల్లో స్థానిక పోలీసు చీఫ్ ఇషాక్ అహ్మద్ కూడా ఉన్నారు. ఈ దాడిని పాకిస్తాన్ అంతర్గత మంత్రి మొహ్సిన్ నఖ్వీ తీవ్రంగా ఖండించారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొన్న పోలీసులు, ప్రస్తుతానికి మరిన్ని వివరాలు వెల్లడించేందుకు నిరాకరించారు. ఈ దాడికి సంబంధించి ఇప్పటివరకు ఏ సంస్థ కూడా బాధ్యత స్వీకరించలేదు. అయితే, పాకిస్తాన్ తాలిబన్‌గా పిలువబడే తెహ్రిక్-ఎ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP) ఈ దాడికి పాల్పడి ఉండవచ్చని భద్రతా అధికారులు అనుమానిస్తున్నారు.
Details
స్వతంత్ర సంస్థగా పనిచేస్తున్న తాలిబాన్
ఇటీవలి నెలల్లో TTP భద్రతా సిబ్బంది, పౌరులపై దాడులను తీవ్రతరం చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. తెహ్రిక్-ఎ-తాలిబాన్ పాకిస్తాన్ ఆఫ్ఘన్ తాలిబాన్‌కు మిత్రసంస్థగా భావించబడుతున్నప్పటికీ, అది పూర్తిగా స్వతంత్ర సంస్థగా పనిచేస్తోంది. 2021లో ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత, TTP మరింత బలంగా ఎదిగిందని పాకిస్తాన్ అభిప్రాయపడుతోంది. పాకిస్తాన్‌పై దాడులు నిర్వహించేందుకు TTPకి ఆఫ్ఘనిస్తాన్ తన భూభాగాన్ని ఉపయోగించుకునే అవకాశం కల్పిస్తోందని పాకిస్తాన్ ప్రభుత్వం ఆరోపిస్తోంది.