
USA: కాలిఫోర్నియాలో బాంబు పేలుడు కలకలం.. ఒకరు మృతి.. నలుగురికి గాయాలు
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా రాష్ట్రం కాలిఫోర్నియాలోని ఓ సంతానోత్పత్తి క్లినిక్ సమీపంలో బాంబు పేలుడు సంభవించి ఒక్కరు ప్రాణాలు కోల్పోగా, మరో నలుగురు గాయపడ్డారు.
ఈ ఘటనను ఉద్దేశపూర్వక ఉగ్రవాద చర్యగా గుర్తించినట్టు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) వెల్లడించింది.
ఈ పేలుడుకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతోందని, పూర్తి సమాచారం త్వరలో వెల్లడిస్తామని FBI లాస్ ఏంజిల్స్ ఫీల్డ్ ఆఫీస్ అసిస్టెంట్ డైరెక్టర్ అకిల్ డేవిస్ తెలిపారు.
పేలుడు సమయంలో క్లినిక్ సమీపంలో ఒక కారు నిలిపి ఉన్నట్లు గుర్తించారు. పేలుడు ఆ కారులోనే జరిగిందా? లేక ఆ కారు దగ్గరే బాంబు అమర్చారా? అన్న కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Details
ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది
ఈ పేలుడు అంతర్జాతీయ ఉగ్రవాదానికి సంబంధించిందా లేదా దేశీయ ఉగ్రవాద చర్యగా పరిగణించాలా అనే దానిపై కూడా దర్యాప్తు కొనసాగుతోందని అకిల్ డేవిస్ స్పష్టం చేశారు.
ఈ ఘటనలో పేలుడు ప్రభావంతో క్లినిక్ చుట్టుపక్కల ఉన్న అనేక భవనాలు దెబ్బతిన్నట్లు సమాచారం. ఘటనతో అక్కడి నివాసితులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
పేలుడు జరిగిన ప్రదేశం 'అమెరికన్ రిప్రొడక్టివ్ సెంటర్' క్లినిక్‌కు దగ్గరగా ఉన్నట్లు గుర్తించారు. ఈ సంస్థకు అమెరికా అంతటా మూడు శాఖలు ఉన్నాయి.
ఈ పేలుడు ఘటన వల్ల ప్రజల్లో ఆందోళన నెలకొంది. భద్రతా యంత్రాంగం అప్రమత్తమై, ఘటనాస్థలాన్ని పూర్తిగా సీజ్ చేసి ఆధారాలను సేకరిస్తోంది.