LOADING...
Brazil: మినాస్‌ గెరాయిస్‌ను ముంచెత్తిన భారీ వరదలు.. 46 మంది మృతి
మినాస్‌ గెరాయిస్‌ను ముంచెత్తిన భారీ వరదలు.. 46 మంది మృతి

Brazil: మినాస్‌ గెరాయిస్‌ను ముంచెత్తిన భారీ వరదలు.. 46 మంది మృతి

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 26, 2026
09:49 am

ఈ వార్తాకథనం ఏంటి

బ్రెజిల్‌లోని మినాస్‌ గెరాయిస్‌(Minas Gerais) రాష్ట్రాన్ని భారీ వర్షాలు చుట్టుముట్టడంతో అక్కడి పరిస్థితి విషమంగా మారింది. ముఖ్యంగా జూయిజ్‌ డీ ఫోరా,ఉబా (Juiz de Fora,Uba) నగరాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. వరదల కారణంగా లక్షలాది మంది ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరదలకు సంబంధించిన వివిధ ఘటనల్లో ఇప్పటివరకు 46 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. అదనంగా 21 మంది గల్లంతైనట్లు సమాచారం.మరికొంతమంది జాడ తెలియకపోవడంతో సహాయక సిబ్బంది విస్తృతంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ప్రమాద తీవ్రత దృష్ట్యా రాత్రి వేళల్లో కూడా రెస్క్యూ బృందాలు నిరంతరం సహాయక కార్యక్రమాలు చేపడుతున్నాయి.

వివరాలు 

రాబోయే కొన్ని రోజులు ఇంకా భారీ వర్షాలు కురిసే అవకాశం

ముంపు ప్రభావిత ప్రాంతాల నుంచి బుధవారం ఉదయం వరకు సుమారు 3,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రాబోయే కొన్ని రోజులు ఇంకా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం హెచ్చరించింది. సుమారు 5,60,000 జనాభా కలిగిన జూయిజ్ డీ ఫోరా నగరంలో వీధులన్నీ బురదతో నిండిపోయి రాకపోకలు నిలిచిపోయాయి. సమీప కొండప్రాంతాల్లో మళ్లీ కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్నట్లు అధికారులు అప్రమత్తం చేశారు. ఇక దాదాపు 1,07,000 జనాభా ఉన్న ఉబా నగరంలో సాధారణ జీవనం పూర్తిగా స్తంభించింది. విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. సోమవారం ఉదయం ప్రారంభమైన వర్షాల కారణంగా ఇప్పటివరకు 20 చోట్ల కొండచరియలు విరిగినట్లు నగర మేయర్ మార్గరీడా సాలమావో(Margarida Salomao) తెలిపారు.

వివరాలు 

బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయం అందిస్తాం: బ్రెజిల్ అధ్యక్షుడు

వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలకు సైన్యం కూడా తోడ్పాటునిస్తోంది. బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయం అందిస్తామని బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్‌ ఇనాసియో లాలూ డ సిల్వా(Luiz Inacio Lula da Silva) భరోసా ఇచ్చారు. కొండలు, లోయలు, లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక వైద్య బృందాలను రంగంలోకి దించారు.

Advertisement