Russia: మరణానికి బ్రేక్.. 150 ఏళ్ల జీవితం దిశగా రష్యా సంచలన పరిశోధన
ఈ వార్తాకథనం ఏంటి
మనిషి మరణాన్ని జయించే దిశగా రష్యాలో శాస్త్రవేత్తలు కీలక పరిశోధనలు చేస్తున్నారు. వృద్ధాప్యాన్ని తగ్గించే ఒక ప్రత్యేక ఔషధాన్ని అభివృద్ధి చేయడానికి అక్కడి పరిశోధకులు కృషి చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కలను నెరవేర్చే ప్రయత్నం జరుగుతోందని సమాచారం. గతేడాది నవంబర్‌లో జరిగిన ఏఐ సదస్సులో పుతిన్ మాట్లాడుతూ మానవులు 150 ఏళ్ల వరకు జీవించే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. తాజాగా రష్యా మంత్రి డెనిస్ సెకిరిన్స్కీ వెల్లడించిన వివరాల ప్రకారం, రష్యన్ శాస్త్రవేత్తలు ప్రపంచంలోనే మొదటిసారిగా మరణాన్ని ఆలస్యం చేసే జన్యు చికిత్స (gene therapy) ఆధారిత ఔషధాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఈ మందు ప్రధానంగా కణాల వృద్ధాప్యానికి కారణమయ్యే RAGE జన్యువును నిరోధించడంపై పనిచేస్తుంది.
వివరాలు
దీర్ఘాయుష్షుపై ప్రత్యేక ఆసక్తి చూపుతున్న పుతిన్
RAGE అంటే 'Receptor for Advanced Glycation End Products'. ఇది కణాల్లో వృద్ధాప్య ప్రక్రియను వేగవంతం చేసే రిసెప్టర్‌గా పనిచేస్తుంది. ఈ జన్యువును నిరోధించడం ద్వారా కణాలను ఎక్కువకాలం యవ్వన స్థితిలో ఉంచవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ పరిశోధనలు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బయాలజీ ఆఫ్ ఏజింగ్ అండ్ మెడిసిన్లో కొనసాగుతున్నాయి. 73 ఏళ్ల వయసులో ఉన్న పుతిన్ దీర్ఘాయుష్షుపై ప్రత్యేక ఆసక్తి చూపుతున్నారని, గతంలో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్తో కూడా ఈ విషయంపై చర్చించినట్లు వార్తలు వెలువడ్డాయి. అలాగే ఆయన తన పదవీకాల భవిష్యత్తుపై కుటుంబ వారసత్వం దిశగా ఆలోచిస్తున్నారనే ప్రచారం కూడా ఉంది. ప్రస్తుతం ఈ వృద్ధాప్య నిరోధక ఔషధం ప్రయోగాత్మక దశలో మాత్రమే ఉంది.