బ్రేకింగ్ న్యూస్: ఉక్రెయిన్‌లో కుప్పకూలిన హెలికాప్టర్, మంత్రి సహ 16మంది మృతి
ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. కిండర్ గార్టెన్ సమీపంలో ఒక హెలికాప్టర్ కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఉక్రెయిన్ మంత్రితో పాటు మొత్తం 16మంది మృతి చెందారు. అందులో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నట్లు అధికారులు చెప్పారు. మరణించిన 16మందిలో ఉక్రెయిన్ అంతర్గత మంత్రి డెనిస్ మొనాస్టైర్స్కీతో పాటు మంత్రిత్వ శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు ఉన్నట్లు జాతీయ పోలీసు అధిపతి ఇగోర్ క్లైమెంకో పేర్కొన్నారు. హెలికాప్టర్ ప్రమాదానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హెలికాప్టర్ కుప్పకూలిన తర్వాత మంటలు చెలరేగాయి. ఆ సమయంలో అందులో ఉన్నవారందరూ కేకలు వేసినట్లు ఆ వీడియో ఉంది.
రష్యా సేనల దాడిలోనే హెలికాప్టర్ కుప్పకూలిందా?
ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర కొనసాగుతోంది. ఈ క్రమంలో రష్యా సేనలను ఉక్రెయిన్ వీరోచితంగా ఎదుర్కుంటున్న క్రమంలో ఆ దేశ మంత్రి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురికావడం బాధాకరమైన విషయం. అంతర్జాతీయంగా ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా.. ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు రష్యా అధ్యక్షుడు పుతిన్. భవిష్యత్‌లో ఉక్రెయిన్ పక్కలో బల్లెంలా మారే అవకాశం ఉందనే అనుమానంతో ఉక్రెయిన్ పై రష్యా యుద్ధాన్ని ప్రకటించింది. ఏడాది కాలంగా ఉక్రెయిన్‌ను ఆక్రమించుకునేందుకు రష్యా ప్రయత్నిస్తున్నా అది జరగడం లేదు. రష్యా సైన్యాన్ని ధీటుగా ఎదుర్కొని ఉక్రెయిన్ సేనలు నిలబడుతున్నాయి. అయితే తాజాగా జరిగిన హెలికాప్టర్ ప్రమాదంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రష్యా సేనల దాడిలోనే హెలికాప్టర్ కుప్పకూలినట్లు ఉక్రెయిన్ అనుమానిస్తోంది.