Loading...
British Airways: ఐర్లాండ్ గగనతలంలో బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమానానికి అత్యవసర పరిస్థితి
ఐర్లాండ్ గగనతలంలో బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమానానికి అత్యవసర పరిస్థితి

British Airways: ఐర్లాండ్ గగనతలంలో బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమానానికి అత్యవసర పరిస్థితి

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 05, 2026
08:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఫ్లైదుబాయ్ విమాన ఘటన మరువకముందే మరో విమానంలో తీవ్ర ఆందోళనకు గురిచేసే పరిణామం చోటుచేసుకుంది. లండన్ నుంచి అమెరికాలోని చికాగోకు బయలుదేరిన బ్రిటిష్ ఎయిర్‌వేస్‌కు చెందిన బీఏ295 విమానంలో గాల్లో ప్రయాణిస్తున్న సమయంలో అకస్మాత్తుగా అత్యవసర పరిస్థితి ఏర్పడింది. ఐర్లాండ్ గగనతలంలో ఈ ఘటన జరగడంతో విమానంలోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

వివరాలు 

37 వేల అడుగుల ఎత్తులో ప్రయాణం

లండన్‌లోని హీత్రూ విమానాశ్రయం టెర్మినల్ 5 నుంచి ఉదయం 11:50 గంటల సమయంలో బీఏ295 విమానం బయలుదేరింది.

చికాగోకు వెళ్లే ఈ షెడ్యూల్డ్ ప్రయాణం సుమారు 8 గంటల 40 నిమిషాల పాటు కొనసాగాల్సి ఉంది.

బోయింగ్ 777-200ఈఆర్ విమానం గాల్లోకి ఎగిరిన తర్వాత దాదాపు 37 వేల అడుగుల ఎత్తుకు చేరుకుంది.

అయితే విమానం బయలుదేరిన సుమారు గంట తర్వాత ఐర్లాండ్ గగనతలంలోకి ప్రవేశించిన సమయంలో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది.

విమానంలో అత్యవసర పరిస్థితి ఏర్పడటంతో అది వేగంగా కిందకు దిగడం ప్రారంభించింది.

ఫ్లైట్ ట్రాకింగ్ డేటా ప్రకారం.. దాదాపు 37 వేల అడుగుల ఎత్తులో ఉన్న విమానం ఒక్కసారిగా సుమారు 9 వేల అడుగుల ఎత్తుకు పడిపోయింది.

వివరాలు 

'స్పావాక్ 7700' అత్యవసర సంకేతం

విమానంలో సాంకేతిక సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది.దీంతో పైలట్లు వెంటనే అప్రమత్తమై అంతర్జాతీయ అత్యవసర ట్రాన్స్‌పాండర్ కోడ్ 'స్పావాక్ 7700'ను జారీ చేశారు.

ఈ సంకేతం విమానంలో అత్యవసర పరిస్థితి ఏర్పడిన విషయాన్ని సూచిస్తుంది.

పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని చికాగోకు కొనసాగాల్సిన ప్రయాణాన్ని పైలట్లు నిలిపివేశారు.

విమానాన్ని తిరిగి లండన్ వైపు మళ్లించారు.యూకే మీడియా కథనాల ప్రకారం..బీఏ295 విమానం సురక్షితంగా లండన్ హీత్రూ విమానాశ్రయానికి తిరిగి వస్తోంది.

అయితే విమానంలో ఖచ్చితంగా ఎలాంటి సాంకేతిక లోపం తలెత్తిందనే విషయంపై బ్రిటిష్ ఎయిర్‌వేస్ ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.

విమానం భారీగా ఎత్తు కోల్పోవడానికి కారణం ఏమిటి,అత్యవసర పరిస్థితికి దారితీసిన సాంకేతిక సమస్య ఏంటి అనే అంశాలపై పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.

ADVERTISEMENT