Page Loader
China: వేధింపులు, ఆధిపత్య ధోరణితో ప్రపంచవ్యాప్తంగా ఒంటరి అవుతారు: జిన్‌పింగ్‌
వేధింపులు, ఆధిపత్య ధోరణితో ప్రపంచవ్యాప్తంగా ఒంటరి అవుతారు: జిన్‌పింగ్‌

China: వేధింపులు, ఆధిపత్య ధోరణితో ప్రపంచవ్యాప్తంగా ఒంటరి అవుతారు: జిన్‌పింగ్‌

వ్రాసిన వారు Sirish Praharaju
May 13, 2025
12:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

విధ్వంసకర ధోరణులు, మితిమీరిన ఆధిపత్య ప్రవర్తనలను ప్రదర్శించినవారికి చివరికి ఒంటరితనం తప్పదని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ పేర్కొన్నారు. వాషింగ్టన్‌-బీజింగ్‌ మధ్య కొనసాగుతున్న వాణిజ్య వివాదాల్లో ముందడుగు పడుతున్న తరుణంలో, అలాగే సుంకాలపై తాత్కాలిక విరామం ప్రకటించిన నేపథ్యంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. వాణిజ్య యుద్ధాల్లో ఎవరూ విజేతలుగా మిగలరని జిన్‌పింగ్ పునరుద్ఘాటించారు. శాంతి,సుస్థిరత ప్రపంచంలో సాధించాలంటే వివిధ దేశాలు పరస్పరం కలసికట్టుగా పని చేయాల్సిన అవసరాన్ని ఆయన హైలైట్ చేశారు. ఈ వ్యాఖ్యలు బీజింగ్‌లో బ్రెజిల్‌, కొలంబియా, చిలే దేశాధినేతలతో జరిగిన సమావేశంలో వెలువడ్డాయి.

వివరాలు 

టారిఫ్‌ యుద్ధానికి 90 రోజుల విరామం 

ఇటీవల రెండు దేశాల మధ్య జరిగిన చర్చల సందర్భంలో,వాణిజ్య విభేదాలను శాంతియుతంగా పరిష్కరించుకునే దిశగా ముందడుగు వేసిన అమెరికా,చైనా, సుంకాలపై విధించిన చర్యలను తాత్కాలికంగా ఉపసంహరించుకోవడంపై ఒక అభిప్రాయానికి వచ్చాయి. ఈ క్రమంలో,టారిఫ్‌ యుద్ధానికి 90 రోజుల విరామాన్ని ఇరుదేశాలు ప్రకటించాయి. చైనాతో జరిగిన ఒప్పందం ప్రకారం, యూఎస్‌ ట్రేడ్‌ రెప్రెజెంటేటివ్‌ జేమిసన్‌ గ్రీర్ ప్రకారం,అమెరికా చైనా వస్తువులపై విధించిన టారిఫ్‌ రేటును 115 శాతం మేర తగ్గించింది. ఫలితంగా గతంలో ఉన్న 145 శాతం సుంకం కేవలం 30 శాతానికి పరిమితమైంది.

వివరాలు 

అమెరికా వస్తువులపై విధించిన సుంకాలను 125 శాతం నుంచి 10 శాతానికి తగ్గించిన చైనా 

అదే విధంగా, చైనా కూడా అమెరికా వస్తువులపై విధించిన సుంకాలను 125 శాతం నుంచి 10 శాతానికి తగ్గించింది. ఈ విషయాన్ని జెనీవాలో గ్రీర్‌తో పాటు అమెరికా వాణిజ్య శాఖ మంత్రి స్కాట్‌ బెసెంట్‌ వెల్లడించారు. అసలు విషయానికి వస్తే, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తన అధ్యక్ష పదవిలో టారిఫ్‌లు విధించిన వేళ, చైనా కూడా అదే స్థాయిలో ప్రతిస్పందిస్తూ, అమెరికా దిగుమతులపై సుంకాలు విధించింది. అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గకుండా, ధైర్యంగా ఎదుర్కొంటున్న దేశంగా తనను తాను ప్రపంచానికి చైనా చూపించేందుకు యత్నించింది.