కాలిఫోర్నియా: చైనీస్ న్యూఇయర్ పార్టీలో తుపాకీ మోత, 10 మంది మృతి
అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో కాల్పులు కలకలం సృష్టించాయి. కాలిఫోర్నియాలోని లాస్ ఏంజెల్స్ మాంటెరీ పార్క్‌లో జరిగిన చైనీస్ లూనార్ న్యూ ఇయర్ పార్టీలో ఓ 72 ఏళ్ల వృద్ధుడు తుపాకీతో రెచ్చిపోయాడు. ఈ కాల్పుల్లో 10మంది అక్కడిక్కకడే మృతి చెందారు. పలువురు గాయపడినట్లు పోలీసులు వెల్లడించారు. కాల్పులు జరిపిన వ్యక్తిని గుర్తించి అతడి వాహనం వద్దకు వెళ్లగా, అప్పటికే తుపాకీతో కాల్చుకొని అతను ఆత్మహత్య చేసుకున్నట్లు లాస్ ఏంజిల్స్ కౌంటీ షెరీఫ్ రాబర్ట్ లూనా చెప్పారు. గతేడాది మే నెలలో టెక్సాస్‌లో ఎలిమెంటరీ స్కూల్‌లో ఒక షూటర్ 22 మందిని చంపినప్పటి నుంచి అమెరికాలో జరిగిన అత్యంత ఘోరమైన కాల్పుల ఘటన ఇదే కావడం గమనార్హం.
ప్రభుత్వ ఆఫీసుల వద్ద జాతీయ జెండాలను అవతనం చేయాలి: బైడెన్
మాంటెరీ పార్క్‌లో జరిగిన కాల్పుల ఘటనపై వైట్ హౌస్ తీవ్ర సంతాపాన్ని ప్రకటించింది. మృతుల సంతాప సూచికంగా ప్రభుత్వ ఆఫీసుల వద్ద అమెరికా జాతీయ జెండాలను అవతనం చేయాలని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఆదేశించినట్లు వైట్ హౌస్ ఒక ప్రకటనలో తెలిపింది. దక్షిణ కాలిఫోర్నియాలో చైనీస్ లూనార్ న్యూ ఇయర్‌ను ఘనంగా నిర్వహిస్తారు. రెండురోజుల పాటు జరగాల్సిన ఈవేడుకను కాల్పుల నేపథ్యంలో రెండో రోజు పండగను రద్దు చేశారు. గత సంవత్సరం 647 సామూహిక కాల్పుల సంఘటనలు జరిగినట్లు గన్ వయొలెన్స్ ఆర్కైవ్ వెబ్‌సైట్ పేర్కొంది. ఒక షూటర్ చేతిలో కనీసం నలుగురు వ్యక్తులు కాల్పులు బారిన పడినట్లు వెల్లడించింది. 2022లో 44,000 మందికి పైగా తుపాకీ గాయాలతో మరణించినట్లు చెప్పింది.