మార్టిన్ లూథర్ కింగ్ డే: ఇరువర్గాలు పరస్పరం కాల్పులు, 8మందికి గాయాలు
అమెరికా ఫ్లోరిడాలోని ఫోర్ట్ పియర్స్‌లో 'మార్టిన్ లూథర్ కింగ్ డే' ఈవెంట్‌లో కాల్పులు కలకలం సృష్టించాయి. ఇరు వర్గాలు మధ్య జరిగిన కాల్పుల్లో ఎనిమిది మంది గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. వారి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. మృతులపై ఇంకా ఎలాంటి సమాచారం లేదని సెయింట్ లూసీ కౌంటీ షెరీఫ్ కార్యాలయం పేర్కొంది. 'మార్టిన్ లూథర్ కింగ్ డే' నేపథ్యంలో లైవ్ మ్యూజిక్, పిల్లల కోసం కార్యకలాపాలు, కార్ షోతో పాటు ఇతర ఈవెంట్‌లను నిర్వహించారు. ఇందులో పాల్గొనేందుకు వేలాదిగా తరలివచ్చారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగి కాల్పులకు దిగినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
1968లో మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ హత్య
1968లో మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ హత్యకు గురయ్యారు. లూథర్ కింగ్ జూనియర్ మరణాంతరం గౌరవార్థం ఆయన జయంతి అయిన జనవరి 15న సెలవు దినంగా ఆమెరికా ప్రభుత్వం ప్రకటించింది. ఆరోజును 'మార్టిన్ లూథర్ కింగ్ డే'గా జరుపుకుంటారు. వాషింగ్టన్‌లో జిరిగిన 'మార్టిన్ లూథర్ కింగ్ డే'లో మార్టిన్ లూథర్ కింగ్ III పాల్గొని తన తండ్రికి నివాళులర్పించారు. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ అమెరికాలో పౌర హక్కుల కోసం ఉద్యమించారు. 1957లో సదరన్ క్రిస్టియన్ లీడర్‌షిప్ కాన్ఫరెన్స్ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. ఈ సంస్థకు మొదటి అధ్యక్షుడు అతనే కావడం గమనార్హం. 1964 లోఅతి చిన్న వయస్సులో నోబెల్ పురస్కారం పొందిన వ్యక్తిగా ఖ్యాతినార్జించాడు.