Page Loader
అమెరికాను వణికిస్తున్న భారీ వర్షాలు.. కాలిఫోర్నియాను వీడుతున్న ప్రజలు
కాలిఫోర్నియాలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న అధికారులు

అమెరికాను వణికిస్తున్న భారీ వర్షాలు.. కాలిఫోర్నియాను వీడుతున్న ప్రజలు

వ్రాసిన వారు Stalin
Jan 11, 2023
01:31 pm

ఈ వార్తాకథనం ఏంటి

మొన్నటి వరకు మంచుతుపానుతో అల్లాడిపోయిన అమెరికా ప్రజలను ఇప్పుడు భారీ వర్షాలు వెంటాడుతున్నాయి. కాలిఫోర్నియా, లాస్ ఏంజెలిస్‌తో పాటు శాన్ ఫ్రాన్సిస్కోలో కుండపోత వర్షాలు, బలమైన గాలులతో ప్రజలు వణికిపోతున్నారు. ముఖ్యంగా కాలిఫోర్నియాలో వర్షాల ప్రభావం అధికంగా ఉంది. రోడ్లన్నీ నదులుగా మారాయి. జన జీవనం స్తంభించిపోయింది. ఈదురు గాలులకు విద్యుత్ స్తంభాలు నెలకొరిగాయి. దీంతో సరఫరా నిలిచిపోయి కాలిఫోర్నియా అంధకారంలో మగ్గుతోంది. బుధవారం కూడా భారీ వర్ష సూచన ఉండటంతో కాలిఫోర్నియాలోని ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలిస్తున్నారు. దాదాపు 25వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించే అవకాశం ఉంది.

కాలిఫోర్నియా

అంధకారంలో 2లక్షల ఇళ్లు

భారీ వర్షాలతో పాటు ఈదురు గాలులకు లాస్ ఏంజెలిస్‌ కూడా ప్రభావితమైంది. లాస్ ఏంజెలిస్‌‌కు 160 కిమీ దూరంలో ఉన్న కాలిఫోర్నియాలోని శాంటా బార్బరా నగరం చాలా దెబ్బతిన్నది. భారీ వర్షాలు, మెరుపులు, వడగళ్ల వానతో పాటు కొండచరియలు విరిగిపడటంతో లక్షలాది మంది బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. దాదాపు 2లక్షలకు పైగా ఇళ్లకు కరెంటు నిలిచిపోయింది. శాంటా బార్బరా సమీపంలోని ధనికులు అధికంగా నివసించే.. మాంటెసిటోలోని ప్రజలను ఖాళీ చేయవలసిందిగా అధికారులు ఆదేశించారు. కాలిఫోర్నియా రాష్ట్రం ప్రస్తుతం వర్ష ప్రభావిత ప్రాంతాలు 17 ఉన్నాయి.