Commercial Drivers Licenses: అమెరికాలో ప్రవాస డ్రైవర్లకు కొత్త ఇబ్బందులు.. కాలిఫోర్నియాలో 17,000 లైసెన్సులు రద్దు!
ఈ వార్తాకథనం ఏంటి
విదేశీయులకు వీసాల జారీ విధానాన్ని కఠినతరం చేస్తున్న అమెరికా ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. కాలిఫోర్నియా రాష్ట్ర ప్రభుత్వం ప్రవాస డ్రైవర్లకు జారీ చేసిన 17,000 కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్సులను రద్దు చేయాలని నిర్ణయించింది. సెమీ ట్రక్‌లు, బస్సులు నడిపేందుకు కొంతమంది అక్రమంగా లైసెన్సులు పొందారని, ఈ పరిస్థితి వల్ల కాలిఫోర్నియా రాష్ట్రం అక్రమ వలసలకు కేంద్రంగా మారుతోందని ట్రంప్ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.
వివరాలు
కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్సులపై సమగ్ర సమీక్ష
అయితే, ఈ నిర్ణయం వెనుక అది కారణం కాదని కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్ స్పష్టం చేశారు. ఆయన ప్రకారం, రద్దయిన లైసెన్సుల గడువు కాలం పూర్తయిందని రాష్ట్ర రవాణా శాఖ గుర్తించిందని తెలిపారు. దీంతో, కాలిఫోర్నియా రవాణా సంస్థ కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్సులపై సమగ్ర సమీక్ష ప్రారంభించింది. ఈ ప్రక్రియలో, లైసెన్సుల మంజూరులో ఏవైనా లోపాలు ఉన్నాయా అన్నదాన్ని కూడా అధికారులు పరిశీలిస్తున్నారు.