Loading...
California: బిలియనీర్లకు భారీ ఊరట.. సంపదపై 5 శాతం పన్ను ప్రతిపాదనకు బ్రేక్‌!
బిలియనీర్లకు భారీ ఊరట.. సంపదపై 5 శాతం పన్ను ప్రతిపాదనకు బ్రేక్‌!

California: బిలియనీర్లకు భారీ ఊరట.. సంపదపై 5 శాతం పన్ను ప్రతిపాదనకు బ్రేక్‌!

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 10, 2026
12:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలోని కాలిఫోర్నియాలో అత్యంత సంపన్నులపై అదనపు పన్ను విధించాలన్న ప్రతిపాదనకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బిలియనీర్ల సంపదపై 5 శాతం పన్ను విధించాలన్న ప్రతిపాదనను ఓటర్లు తిరస్కరించారు. దీంతో సంపన్నుల నుంచి భారీ మొత్తంలో పన్ను వసూలు చేసి,ఆరోగ్య రంగానికి నిధులు సమకూర్చాలన్న ప్రయత్నానికి తాత్కాలికంగా అడ్డుకట్ట పడింది. కాలిఫోర్నియాలో మెటా అధినేత మార్క్ జుకర్‌బర్గ్, కిమ్ కర్దాషియాన్, ఓప్రా విన్‌ఫ్రే వంటి ప్రముఖులతో కలిపి సుమారు 200 మంది బిలియనీర్లు ఉన్నారు. వీరిలో 110 కోట్ల డాలర్లకు (సుమారు రూ.9 వేల కోట్లకు పైగా) మించి సంపద కలిగిన వారిపై పన్ను విధించాలని ప్రతిపాదించారు.

వివరాలు 

ప్రతిపాదన అమల్లోకి వస్తే.. 10,000 కోట్ల డాలర్ల ఆదాయం  

ఇందుకోసం 'ప్రపోజిషన్ 40' పేరుతో ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. దీని ప్రకారం బిలియనీర్ల మొత్తం ఆస్తులు, షేర్ల విలువపై ఒకేసారి 5 శాతం పన్ను వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే సుమారు 10,000 కోట్ల డాలర్ల ఆదాయం సమకూరుతుందని అంచనా వేశారు.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన పన్నులు, ప్రభుత్వ వ్యయాలకు సంబంధించిన కొత్త చట్టం కారణంగా కాలిఫోర్నియా ఆరోగ్య రంగానికి అందే కేంద్ర నిధులు తగ్గనున్నాయి.

ఈ నేపథ్యంలో ఏర్పడే ఆర్థిక లోటును పూడ్చడంతోపాటు వైద్య సేవలకు అవసరమైన నిధులు సమకూర్చేందుకు బిలియనీర్లపై పన్ను విధించాలని ప్రతిపాదకులు భావించారు.

అయితే ఈ అంశంపై డెమొక్రాట్లు, కార్మిక సంఘాల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

వివరాలు 

2028లో బిలియనీర్లపై పన్ను విధించే ప్రతిపాదన

మరోవైపు గూగుల్ సహ వ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్,కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసమ్ ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించారు.

బిలియనీర్లపై భారీగా పన్ను విధిస్తే వారు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లే అవకాశం ఉందని గవర్నర్ ఆందోళన వ్యక్తం చేశారు.

అదే జరిగితే రాష్ట్రానికి వచ్చే ఆదాయపు పన్ను కూడా తగ్గుతుందని అభిప్రాయపడ్డారు.

ఈ పన్ను ప్రతిపాదనను అడ్డుకునేందుకు సెర్గీ బ్రిన్ ఏకంగా 10 కోట్ల డాలర్లకు పైగా ఖర్చు చేసినట్లు వార్తలు వెలువడ్డాయి.

అయితే బిలియనీర్లపై పన్ను విధించాలన్న ప్రతిపాదనకు మద్దతు తెలిపిన కార్మిక సంఘాల నాయకుడు డేవ్ రీగన్ వెనక్కి తగ్గడం లేదు.

ఈ అంశంపై మరోసారి ప్రయత్నిస్తామని ప్రకటించారు. 2028లో బిలియనీర్లపై పన్ను విధించే ప్రతిపాదనను మళ్లీ తీసుకొస్తామని వెల్లడించారు.

ADVERTISEMENT

వివరాలు 

కాలిఫోర్నియాలో సంపన్నులు, పేదల మధ్య ఆర్థిక వ్యత్యాసం

ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఉన్న కాలిఫోర్నియాలో సంపన్నులు, పేదల మధ్య ఆర్థిక వ్యత్యాసం భారీగా ఉంది.

ఇలాంటి పరిస్థితుల్లో అత్యంత ధనవంతులపై అదనపు పన్ను విధించాలన్న ప్రతిపాదనకు ఓటర్లు మద్దతు ఇవ్వకపోవడం చర్చనీయాంశంగా మారింది.

ఆరోగ్య రంగానికి నిధులు సమకూర్చే లక్ష్యంతో తీసుకొచ్చిన ఈ ప్రతిపాదనకు ప్రజలు తిరస్కారం తెలపడంతో, భవిష్యత్తులో ఈ అంశం ఎలాంటి మలుపులు తిరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది.

ADVERTISEMENT