Canada: గోల్డీ బ్రార్‌పై కెనడా భారీ రివార్డు.. ఆచూకీ చెబితే రూ.1.63 కోట్లు
ఈ వార్తాకథనం ఏంటి
సిద్ధూ మూసేవాలా హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ కోసం కెనడా ప్రభుత్వం భారీ రివార్డును ప్రకటించింది. అతడి ఆచూకీ తెలియజేసి, పోలీసుల అరెస్టుకు సహకరించే వారికి గరిష్ఠంగా 2,50,000 కెనడియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ.1.63 కోట్లు) అందించనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు కెనడాకు చెందిన బోలో (Be On the Lookout) సంస్థ తాజాగా విడుదల చేసిన 25 మంది మోస్ట్ వాంటెడ్ నేరస్థుల జాబితాలో గోల్డీ బ్రార్‌కు మొదటి స్థానం కల్పించింది.
వివరాలు
సుఖా దునేకే హత్య కేసులోనూ నిందితుడు
కెనడాలోని విన్నిపెగ్ నగరంలో 2023 సెప్టెంబర్ 20న 39 ఏళ్ల సుఖ్‌దూల్ సింగ్ గిల్ అలియాస్ సుఖా దునేకే కాల్పుల్లో హత్యకు గురయ్యాడు.
ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన కెనడా పోలీసులు గోల్డీ బ్రార్‌పై కేసు నమోదు చేశారు.
ఈ హత్యలో అతడితో పాటు కరణ్‌బీర్ సింగ్ ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు రావడంతో ఇద్దరిపై చర్యలకు సిద్ధమయ్యారు.
2026 ఫిబ్రవరి 23న గోల్డీ బ్రార్,కరణ్‌బీర్ సింగ్‌లపై ఫస్ట్ డిగ్రీ హత్య, హత్యకు కుట్ర పన్నినట్లు అభియోగాలు మోపుతూ అరెస్ట్ వారెంట్లు జారీ చేశారు.
అయితే,ఇప్పటివరకు వీరిద్దరూ పోలీసులకు పట్టుబడలేదు. దీంతో కెనడా తాజాగా విడుదల చేసిన మోస్ట్ వాంటెడ్ 25 మంది జాబితాలో వీరిలో ప్రధాన నిందితుడిగా ఉన్న గోల్డీ బ్రార్‌ను చేర్చింది.
వివరాలు
అమెరికాలోనూ భారీ రివార్డు ప్రకటన
గోల్డీ బ్రార్ కోసం కెనడాతో పాటు అమెరికా దర్యాప్తు సంస్థలు కూడా గాలిస్తున్నాయి. అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) గత సెప్టెంబర్‌లో అతడిని తమ టెన్ మోస్ట్ వాంటెడ్ ఫ్యూజిటివ్స్ జాబితాలో చేర్చింది.
అతడి ఆచూకీ తెలిపిన వారికి గరిష్ఠంగా 10 లక్షల అమెరికన్ డాలర్లు (సుమారు రూ.8.9 కోట్లు) రివార్డుగా అందిస్తామని ప్రకటించింది.
భారత్‌లోనూ గోల్డీ బ్రార్‌పై పలు కేసులు నమోదయ్యాయి. అతడి కోసం జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) కూడా గాలిస్తోంది.
అతడి ఆచూకీ తెలియజేసిన వారికి రూ.10 లక్షల రివార్డు ఇస్తామని గతంలోనే ప్రకటించింది. దీంతో భారత్, కెనడా, అమెరికా దర్యాప్తు సంస్థలకు గోల్డీ బ్రార్ కీలక నిందితుడిగా మారాడు.
వివరాలు
ఎవరీ గోల్డీ బ్రార్?
గోల్డీ బ్రార్ అసలు పేరు సతీందర్‌జీత్ సింగ్. పంజాబ్‌కు చెందిన ఇతడికి గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌తో సంబంధాలు ఉన్నట్లు దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయి.
చండీగఢ్‌లో కళాశాలలో చదువుకునే రోజుల్లోనే నేర కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులతో పరిచయాలు ఏర్పడినట్లు సమాచారం.
2017లో ఉన్నత చదువుల కోసం కెనడాకు వెళ్లిన గోల్డీ బ్రార్.. అక్కడి నుంచే పంజాబ్‌లో నేర కార్యకలాపాలను కొనసాగించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
వివరాలు
ఎవరీ గోల్డీ బ్రార్?
ఆ తర్వాత లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో కలిసి పనిచేసినట్లు, కొంతకాలానికి వారితో విభేదాలు ఏర్పడినట్లు పలు నివేదికలు వెల్లడించాయి.
ప్రముఖ పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసులోనూ గోల్డీ బ్రార్ పేరు ప్రధానంగా వినిపించింది.
ఈ హత్యతో అతడికి సంబంధం ఉందని భారత దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నాయి.
ప్రస్తుతం పలు దేశాల దర్యాప్తు సంస్థలు అతడి కోసం గాలిస్తుండటంతో గోల్డీ బ్రార్ వ్యవహారం మరోసారి అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.